విజయ్ నిర్ణయానికి రాశిఖన్నా రివర్స్

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను తన చివరి లవ్ సినిమాగా చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఇకపై ప్రేమకథల్లో నటించనని ఓపెన్ గా ప్రకటించాడు. దీనిపై ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయంపై తారలు కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా రాశిఖన్నా స్పందించింది. విజయ్ దేవరకొండ నిర్ణయాన్ని వ్యతిరేకించింది ఈ బ్యూటీ.

“కెరీర్ విషయంలో ఎవరి నిర్ణయాలు వాళ్లవి. విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. కానీ మద్దతు మాత్రం ఇవ్వను. ఎందుకంటే చాలామంది మహిళలు విజయ్ దేవరకొండ లవ్ స్టోరీస్ చేస్తే చూడాలనుకుంటున్నారు. అతడికొక స్టయిల్ ఉంది. అతడు మంచి పెర్ఫార్మర్. పైగా ఇప్పుడు లవ్ స్టోరీలు చేయాల్సిన వయసు అతనిది. కాబట్టి అతడు అప్పుడప్పుడైనా లవ్ స్టోరీల్లో నటించాలనేది నా ఉద్దేశం.”

ఇలా విజయ్ దేవరకొండ నిర్ణయాన్ని మీడియా సాక్షిగా వ్యతిరేకించింది రాశిఖన్నా. అతడితో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ చిన్నది, కెరీర్ లో తను చూసిన ఉత్తమ నటుల్లో విజయ్ దేవరకొండ ఒకడని చెప్పుకొచ్చింది. అతడు థియేటర్ ఆర్టిస్ట్ అనే విషయం, అతడితో పరిచయమైన తర్వాత తెలిసిందని.. అందుకే అంత బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాడని అంటోంది.