తమిళనాట.. బీజేపీ వర్సెస్ విజయ్

తమిళనాడులో రాజకీయం రకరకాలుగా మలుపులు తిరుగుతోంది. సినిమా స్టార్ల చుట్టూ బీజేపీ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ హీరో విజయ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు సంచలనంగా మారాయి. ఎంతగా అంటే.. నైవేలీలో షూటింగ్ లో ఉన్న విజయ్ ను ఉన్న ఫళంగా ఇంటికి తీసుకువెళ్లి మరీ.. సోదాలు, తనిఖీలు చేయడం.. ఆస్తుల లెక్కలు పరిశీలించడాన్ని చూస్తే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందన్నది తెలిసిపోతోంది.

ఇదిలా ఉంటే.. నైవేలీలో అనుమతులు లేకుండా ఎలా షూటింగ్ చేస్తారంటూ…. ‘మాస్టర్’ చిత్రీకరణను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గతంలోనే అనుమతి నిరాకరించినా… ఎందుకు చిత్రీకరణ చేస్తున్నారని నిలదీశారు. తాము విజయ్ పై కక్షతో ఇలా చేయడం లేదని.. ఏ హీరో సినిమా అయినా ఇలాగే అడ్డుకునే వారమని చెబుతున్నారు. కానీ.. వేరే చిత్రాల షూటింగులు జరిగినప్పుడు ఇలా ఎందుకు అడ్డుకోలేదన్న అతని అభిమానుల ప్రశ్నకు మాత్రం సమాధానాలు లేవు.

ఈ ఎపిసోడ్ లో.. తాజా అప్ డేట్ ఏంటంటే.. విజయ్ ఇళ్లలో సోదాలు ముగిశాయి. అతను హీరోగా నటించిన బిగిల్ చిత్ర నిర్మాత ఇళ్లపైనా దాడులు చేసిన అధికారులు.. ఏజీఎస్ సంస్థ, అధినేత అన్బు చెళియన్ కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు చేశారు. సేకరించిన కొన్ని పత్రాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పారు. అన్బు చెళియన్ ఇంటి నుంచి లెక్కలో తేలని 77 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు.