కొహ్లీని తొమ్మిదిసార్లు పడగొట్టిన మొనగాడు

  • టిమ్ సౌథీ స్వింగ్, పేస్ కు కొహ్లీ కంగు

ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ. అంతర్జాతీయ క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ అత్యంత నిలకడగా రాణిస్తున్న మొనగాడు. టెస్టులు, వన్డేలు, టీ-20 ఫార్మాట్లలో కలసి 70కి పైగా సెంచరీలు బాదిన ధీరుడు.

ప్రతి ఐదు ఇన్నింగ్స్ కు ఓ శతకం బాదే పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ. అలాంటి అత్యుత్తమ బ్యాట్స్ మన్ ను సైతం…పదే పదే అవుట్ చేస్తూ వచ్చిన ఘనతను న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ సొంతం చేసుకొన్నాడు.

అక్లాండ్ ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన రెండో వన్డేలో కేవలం 15 పరుగుల స్కోరుకే టిమ్ సౌథీ బౌలింగ్ లో కొహ్లీ అవుటయ్యాడు. దీంతో…కేవలం సౌథీ బౌలింగ్ లోనే కొహ్లీ అత్యధికసార్లు అవుటైన రికార్డు మూటగట్టుకొన్నాడు.

వన్డే, టెస్టు, టీ-20 ఫార్మాట్లలో… కొహ్లీని అత్యధికంగా తొమ్మిదిసార్లు అవుట్ చేసిన బౌలర్ ఘనతను టిమ్ సౌథీ సొంతం చేసుకోగలిగాడు.

వన్డే క్రికెట్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ రవి రాంపాల్ చేతిలో ఆరుసార్లు అవుటైన కొహ్లీని…ఆ తర్వాత అత్యధికంగా అవుట్ చేసిన బౌలర్లలో తిస్సార పెరీరా, ఆడం జంపా ఉన్నారు. ఈ ఇద్దరూ ఐదేసిసార్లు కొహ్లీ వికెట్ సాధించారు.

ఇంగ్లండ్ బౌలర్లు జేమ్స్ యాండర్సన్, గ్రీమ్ స్వాన్… కొహ్లీని ఎనిమిదిసార్లు పడగొట్టిన రికార్డు సాధించారు.

మోర్నీ మోర్కెల్, ఆడం జంపా, నేథన్ లయన్, రవి రాంపాల్…. మూడు ఫార్మాట్లలో కలసి ఏడేసిసార్లు కొహ్లీ వికెట్ ను సాధించిన బౌలర్లుగా ఉన్నారు.