స్టుడియో రౌండప్ (09-02-2020)

ఆచార్య

చిరంజీవి-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఆచార్య అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోకాపేట్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత ఔట్ డోర్ షూటింగ్ ఉంటుంది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో ఉన్న బూత్ బంగ్లాలో ఓ సెట్ వేసి అక్కడ షూటింగ్ చేస్తారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

వకీల్ సాబ్

పింక్ సినిమాకు రీమేక్ గా పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో వస్తున్న సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ను ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయింది. రేపట్నుంచి అన్నపూర్ణ స్టుడియోస్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

పవన్-క్రిష్ మూవీ

వకీల్ సాబ్ తో సమాంతరంగా క్రిష్ దర్శకత్వంలో సినిమాను కూడా పూర్తిచేయబోతున్నాడు పవన్. ఈ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభించారు. వారంలో వకీల్ సాబ్ కు 3 రోజులు, క్రిష్ మూవీకి 3 రోజులు చొప్పున పవన్ కాల్షీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.

వైల్డ్ డాగ్

నాగార్జున హీరోగా నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కొలిక్కి వచ్చింది. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ బ్యాంకాక్ లో ప్లాన్ చేశారు. మరికొన్ని రోజుల్లో ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దీంతో టోటల్ షూట్ కంప్లీట్ అవుతుంది. వంశీ పైడిపల్లి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సాల్మన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో దియా మీర్జా హీరోయిన్.

లవ్ స్టోరీ

నాగచైతన్య-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ నిజామాబాద్ జిల్లాలో మొదలైంది. ఆర్మూర్ లో హీరోహీరోయిన్లపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 2న సినిమా రిలీజ్ అవుతుంది.

శ్రీకారం

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా శ్రీకారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో ఉన్న శంకరపల్లిలో జరుగుతోంది. వ్యవసాయానికి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు బి.కిషోర్ దర్శకుడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానుంది.

రంగ్ దే

భీష్మ సినిమాను కంప్లీట్ చేసిన నితిన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగ్ దే సినిమాను స్టార్ట్ చేశాడు. వెంకీ అట్లూరి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామానాయుడు స్టుడియోస్ లో జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.