జూనియర్ ప్రపంచకప్ లో టైటిల్ ఫైట్

  • ఐదో ప్రపంచకప్ టైటిల్ కు భారత్ గురి
  • ఫైనల్లో భారత్ కు బంగ్లాదేశ్ సవాల్

సౌతాఫ్రికా వేదికగా గత మూడువారాలుగా జరుగుతున్న 2020 అండర్-19 ప్రపంచకప్ టైటిల్ సమరానికి పోచెఫ్స్ స్ట్ర్రోమ్ వేదికగా రంగం సిద్ధమయ్యింది.

కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే ఈ పోరులో హాట్ ఫేవరెట్ భారత్ తో సంచలనాల బంగ్లాదేశ్ ఢీ కొనబోతోంది. ఐదోసారి ప్రపంచకప్ టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో ప్రియం గర్గ్ నాయకత్వంలోని భారత్ ఉరకలేస్తుంటే..అక్బర్ ఖాన్ నేతృత్వంలోని బంగ్లాజట్టు తొలి టైటిల్ కోసం కలలు కంటోంది.

ఫైనల్లో ఏడోసారి భారత్….

రెండుదశాబ్దాల అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటికే అత్యధికంగా ఆరు ఫైనల్స్ ఆడి…నాలుగు టైటిల్స్ తో రికార్డు నెలకొల్పిన భారతజట్టు.. ఏడోసారి టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది.

గ్రూప్ లీగ్ నుంచి సెమీఫైనల్స్ వరకూ శ్రీలంక, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, పాకిస్థాన్ లాంటి జట్లను అలవోకగా ఓడించడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ మరోసారి విజేతగా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రియం గర్గ్ నాయకత్వంలోని భారతజట్టులో మేటి ఆల్ రౌండర్లు యశస్వి జైస్వాల్, రవి బిష్నోయ్, పేస్ బౌలర్ల జోడీ కార్తీక్ త్యాగీ, ఆకాశ్ సింగ్, మిశ్రా, స్పిన్ జాదూ అన్కోల్కర్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జ్యురెల్ లాంటి మేటి ఆటగాళ్లున్నారు.

క్రికెట్ వర్గాలలో పానీపూరీ కుర్రాడిగా గుర్తింపు పొందిన యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకూ ఆడిన ఐదుమ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలు, ఓ సూపర్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ అవార్డు కు చేరువయ్యాడు.

తొలిసారి ఫైనల్లో బంగ్లాదేశ్….

తొలిసారి జూనియర్ ప్రపంచకప్ ఫైనల్స్ చేరిన బంగ్లాదేశ్…టైటిల్ సమరంలో పవర్ ఫుల్ భారత్ పై సంచలన విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.

క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్, సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్లను ఓడించిన ఆత్మవిశ్వాసంతోనే పైనల్లో సైతం భారత్ కు గట్టి పోటీ ఇవ్వగలమన్న ధీమాతో టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది.

గత 12 ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్న బంగ్లాజట్టుకు అత్యుత్తమంగా మూడోస్థానం సాధించిన రికార్డు మాత్రమే ఉంది. ఫైనల్లోభారత్ పై బంగ్లాదేశ్ నెగ్గితే అది గొప్పసంచలనమే కాదు.. సరికొత్త రికార్డే అవుతుంది.

గత రికార్డులు, ప్రస్తుత ఆటతీరును బట్టి చూస్తే…భారత కుర్రాళ్లే మరోసారి తిరుగులేని విశ్వవిజేతలుగా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.