కొండపైకి క్యూ కడుతున్న టాలీవుడ్ ప్రముఖులు

తిరుమల కొండపై ఇప్పుడు టాలీవుడ్ సీజన్ నడుస్తున్నట్టుంది. స్టార్స్, ప్రముఖులంతా ఒక్కొక్కరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మొన్నటికిమొన్న హీరోయిన్ సమంత తిరుమల వెళ్లింది. ఎప్పట్లానే నడుచుకుంటూ కొండపైకి వెళ్లిన సమంత, శ్రీవారిని దర్శించుకుంది. అదే టైమ్ లో నిర్మాత దిల్ రాజు కూడా సమంతతో పాటు నడుకుంటూ కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాడు.

ఈరోజు సంగీత దర్శకుడు తమన్ శ్రీవారి సేవలో తరించాడు. నిత్యం కంపోజింగ్స్ తో బిజీగా ఉండే ఈ సంగీత దర్శకుడు ఈసారి దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి దర్శనం చేసుకున్నాడు. రామజోగయ్య శాస్త్రితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు ఈసారి.

ఇక బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా ఈరోజు శ్రీవారిని దర్శించుకుంది. తను ఎవర్ని పెళ్లాడినా, ఆ పెళ్లి మాత్రం తిరుమలలోనే చేసుకుంటానని గతంలో జాన్వి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమెకు వెంకటేశ్వరస్వామి అంటే అంత భక్తి. వీళ్లందరికంటే 2 రోజుల ముందే కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇలా స్టార్స్, ప్రముఖులంతా ఒకేసారి తిరుమల కొండపైకి క్యూ కడుతున్నారు.