చిరంజీవితో మోహన్ బాబు ఢీ

మెగా స్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. స్టాలిన్ తర్వాత చిరుతో త్రిష నటించడం ఇది రెండోసారి..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు విలన్ గా కనిపిస్తారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఇదో కొత్త అప్ డేట్ గా చెబుతున్నారు. మోహన్ బాబుతో కలిసి చిరంజీవి చాలా చిత్రాల్లో నటించారు. అయితే మధ్యలో వీరి మధ్య గొడవలు జరగడం.. వాదులాడుకోవడం.. ఈ మధ్య మా మీటింగ్ లో ఒకరినొకరు హత్తుకోవడంతో సహృద్భావ వాతావరణం ఏర్పడింది.

కొరటాల శివ చిత్రాల్లో బలమైన విలన్లు ఉంటారు. ఆయన మొదటి నుంచి తన చిత్రాల్లో విలన్ పాత్రను కంటెంట్ పరంగా బాగా తీర్చిదిద్దుతారు. విలన్ బేస్ డ్ గానే చిత్రాలతో కొరటాల ప్రసిద్ది చెందారు. ఇప్పుడు చిరంజీవికి పోటీగా బలమైన విలన్ గా మోహన్ బాబును తీసుకున్నారు. అందుకోసమే ఏరికోరి చిరంజీవితో సరితూగే మోహన్ బాబును తీసుకున్నారని సమాచారం.

కొరటాల శివ తన సినీ కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వలేదు. దీంతో తాజాగా చిరంజీవి చిత్రంపై బోలెడు అంచనాలున్నాయి. మోహన్ బాబును కూడా చిరు సినిమాలో చేయిస్తే ఆ సినిమాపై హైప్ చాలా రేట్లు పెరగనుంది.