ఇవాళ్టి నుంచి మరో సినిమా

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం నాని స్టయిల్. ఓ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతాడు. గ్యాప్ ఇవ్వడం అస్సలు ఇష్టముండదు. కొంతమంది హీరోల్లా ఫారిన్ టూర్స్ లాంటివి అస్సలు పెట్టుకోడు. ఈ క్రమంలో V అనే సినిమాను పూర్తిచేసిన నాని, ఇవాళ్టి నుంచి టక్ జగదీష్ సెట్స్ పైకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఈరోజు నుంచి హైదరాబాద్ లో టక్ జగదీష్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో.. ఇవాళ్టి నుంచి ఏకథాటిగా షెడ్యూల్ జరపాలని నిర్ణయించారు.

ఇంతకుముందు నాని-నిర్వాణ కాంబోలో నిన్నుకోరి సినిమా వచ్చింది కాబట్టి ఈసారి వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా మరింత వేగంగా పూర్తయ్యే ఛాన్స్ ఉంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో నాని సరసన రీతూవర్మ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాను సెప్టెంబర్ కు రెడీ చేయాలనేది ప్లాన్.