షఫాలీ కల నిజమాయెగా…

  • సచిన్ తో వీరాభిమాని షఫాలీ ఫోటో

భారత టీనేజ్ క్రికెటర్, ప్రపంచ మహిళా క్రికెట్ సంచలనం షఫాలీవర్మ కల ఎట్టకేలకు నిజమయ్యింది. తాను , తన కుటుంబసభ్యులు బాల్యం నుంచి అభిమానిస్తూ, ఆరాధిస్తూ వస్తున్న సచిన్ టెండుల్కర్ ను కలసి ఫోటో దిగి…ఆ ఫోటోను ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోడం ద్వారా మురిసిపోతోంది.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగనున్న మహిళా టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనటానికి వెళ్లిన భారతజట్టులో 15 సంవత్సరాల షఫాలీ కీలక సభ్యురాలిగా ఉంది.

మరోవైపు …బుష్ ఫైర్ బాధితుల సహాయక క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనటానికి సచిన్ సైతం సిడ్నీ నగరానికి వచ్చాడు. ఆ సమయంలో సిడ్నీ నగరంలోనే విడిది చేసిన షఫాలీ సైతం వెళ్లి తన అభిమాన క్రికెటర్ ను కలసుకొని…అడిగిమరీ ఓ ఫోటో దిగటం ద్వారా తన చిరకాల స్వప్నాన్నినెరవేర్చుకోగలిగింది.

సచిన్ రికార్డునే అధిగమించిన షఫాలీ

కేవలం సచిన్ టెండుల్కర్ స్ఫూర్తితోనే తాను క్రికెట్లోకి వచ్చానని, బాల్యం నుంచి సచిన్ ను చూస్తూ తాను పెరిగానని…తన జీవితంలో ఎప్పటికైనా అభిమాన క్రికెటర్ సచిన్ ను కలసి, మాట్లాడి, ఓ ఫోటో దిగాలని కలలు కన్నానని, ఆ కల కేవలం 15 సంవత్సరాల వయసులోనే నెరవేరిందని షఫాలీ తన ఇన్ స్టాగ్రామ్ సందేశంలో పంచుకొంది.

అంతేకాదు…అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత పిన్నవయసులో హాఫ్ సెంచరీ సాధించిన భారత ప్లేయర్ గా మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును షఫాలీవర్మ అధిగమించడం మరో విశేషం.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ-20 సిరీస్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, రెండోర్యాంకర్ ఇంగ్లండ్ జట్లపై భారతజట్టు విజయాలు సాధించడంలో షఫాలీ కీలకపాత్ర పోషించడం ద్వారా తన సత్తాచాటుకొంది.