కిడ్నాప్ క‌ల‌క‌లం… ఏపీలో వెలుగు చూసిన ఉదంతం…!

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో ఓ కిడ్నాప్ ఉదంతం వెలుగుచూసింది. వారం రోజుల క్రితం కిడ్నాప్ న‌కు గురైన వ్య‌క్తి భీమ‌వ‌రంలో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో క‌న్న‌వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. భీమ‌వ‌రం కు చెందిన లోకేష్ కు క్రికెట్ బెట్టింగ్ లు అల‌వాటు ఉంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు వ్య‌క్తులు…లోకేష్ ని కిడ్నాప్ చేసారు. భీమ‌వ‌రం నుంచి అలా కొన్ని చోట్ల‌ తిప్పి.. చివ‌ర‌కు విశాఖ జిల్లా భీమిలో చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు. అక్కడి నుంచే కిడ్నాప‌ర్లు క‌న్న‌ వాళ్ల‌కు పోన్ చేసారు… లోకేష్ కావాలంటే 35 ల‌క్ష‌లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తాము అంత డ‌బ్బు ఇచ్చుకోలేమ‌ని చెప్పిన తల్లిదండ్రులు రెండు ల‌క్ష‌లు ఇస్తామ‌ని… మా కొడుకును విడిచిపెట్టండని వేడుకున్నారు. అయినా కిడ్నాప‌ర్లు తమ డిమాండ్ కు త‌ల‌గ్గొలేదు. అంత డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే….మీ కొడుకు మీకు ద‌క్క‌డంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో లోకేష్ అమ్మ‌, నాన్న లు భ‌యాందోళ‌న‌లు చెంది పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు లేటెస్ట్ టెక్నాల‌జీని వినియోగించారు. పోలీస్ యాప్ ద్వారా… లోకేష్ ఉన్న లొకేషన్ ను తెలుసుకునే యత్నం చేసారు. అయితే ఆ విష‌యాన్ని తెలుసుకున్న కిడ్నాప‌ర్లు లోకేష్ ను రెండు రోజుల క్రిత‌మే భీమ‌వ‌రంకు తీసుకు వ‌చ్చి వ‌దిలి వెళ్లారు. లోకేష్ ను వ‌దిలి వెళ్లార‌న్న స‌మాచారాన్ని తెలుసుకున్న అమ్మ‌నాన్న‌లు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు.

శ‌రీరం నిండా గాయాల‌తో ఉన్న లోకేష్ ని చూసి చ‌లించిన వాళ్ళు  చికిత్సకై స‌మీప హాస్ప‌ట‌ల్ కు తీసుకెళ్లారు. ఈ మేర‌కు లోకేష్ త‌ల్లి మీడియాతొ మాట్లాడారు. త‌న కొడుకును చిత్ర‌వ‌ధ‌ చేశార‌ని… చెప్పుకోలేని చోట కొట్టారంటూ వాపోయారు. వాళ్ళు కోరినంత డబ్బులు ఇవ్వ‌లేక‌పోవ‌డంతో కొడుకుని తీవ్రంగా కొట్టార‌ని చెప్పారు.

దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కిడ్నాప‌ర్లు త‌మ కొడుకును వ‌దిలి వెళ్లార‌ని పేర్కొన్నారు. భీమ‌వ‌రంలో కిడ్నాప్ అయిన లోకేష్ ఎట్టకేల‌కు క‌న్న‌వారి చెంత‌కు చేరారు. అయితే క్రికెట్ బెట్టింగ్ వ‌ల్లే ఈ కిడ్నాప్ న‌కు కార‌ణ‌మా..? లేక మ‌రేదైనా కార‌ణం ఉందా అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో కొంద‌రు అనుమానితుల‌ను పోలీసుల అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.