భారతజట్లను వీడని ఫైనల్ ఫోబియా?

భారతక్రికెట్ ఓ వింతపరిస్థితిని ఎదుర్కొంటోంది. ఐసీసీ నిర్వహించే ప్రపంచ టోర్నీలలో భారీఅంచనాలతో బరిలోకి దిగటం, అభిమానుల్లో టైటిల్ ఆశలు రేపడం, తీరా కీలక మ్యాచ్ లు ఆడే సమయంలో తడబడటం షరామామూలుగా మారిపోయింది.

2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత మహిళలు, 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ లోనే భారత సీనియర్ జట్టు విఫలమైతే… 2020 జూనియర్ ప్రపంచకప్ ఫైనల్లో భారత కుర్రాళ్లు విఫలమయ్యారు….

అంతర్జాతీయ క్రికెట్లో ఇది ప్రపంచకప్ నామ సంవత్సరం. ఒకే ఏడాదిలో మూడు ప్రపంచకప్ టోర్నీలకు కొత్త దశాబ్దం తొలి సంవత్సరమే ఆతిథ్యమిస్తోంది.

దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన అండర్ -19 ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ వేటకు దిగిన భారత కుర్రాళ్లు చివరకు రన్నరప్ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్ తో ముగిసిన లోస్కోరింగ్ ఫైనల్లో భారత్ 3 వికెట్ల పరాజయంతో మూడోసారి రన్నరప్ మిగలాల్సి వచ్చింది. గ్రూప్ లీగ్ నుంచి సెమీఫైనల్స్ వరకూ..శ్రీలంక, న్యూజిలాండ్, జపాన్, క్వార్టర్ పైనల్లో ఆస్ట్ర్రేలియా, సెమీఫైనల్లో పాకిస్థాన్ లాంటి జట్లను చిత్తు చేసినా.. బంగ్లాదేశ్ తో ముగిసిన టైటిల్ సమరంలో మాత్రం భారతజట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయింది.

పానీపూరీ కుర్రాడి షో….

భారత క్రికెట్లో పానీపూరీ కుర్రాడిగా గుర్తింపు పొందిన యశస్వి జైస్వాల్ సత్తా చాటుకొన్నాడు. అండర్ -19 ప్రపంచకప్ కే అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు.

తొలి రౌండ్ నుంచి ఫైనల్స్ వరకూ ఆడిన ఆరుకు ఆరుమ్యాచ్ ల్లోనూ నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో సహా మొత్తం 400 పరుగులు సాధించాడు.

పాకిస్థాన్ తో ముగిసి సెమీఫైనల్లో యశస్వి ఏకంగా సెంచరీ సాధించాడు. ఫైనల్లో బంగ్లాదేశ్ పై 88 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత్ కు ప్రపంచకప్ అందించలేకపోయానన్న బాధ మిగిలినా..ప్లేయర్ ఆఫ్ ద ప్రపంచకప్ ట్రోఫీ అందుకొని గర్వకారణంగా నిలిచాడు.

లెగ్ స్పిన్ జాదూ రవి బిష్నోయ్…

అంతేకాదు…ప్రపంచకప్ లో అత్యుత్తమ బౌలర్ అవార్డును సైతం భారత లెగ్ స్పిన్ -గుగ్లీ బౌలర్ రవి బిష్నోయ్ సొంతం చేసుకొన్నాడు. ఆరుమ్యాచ్ ల్లో మొత్తం 17 వికెట్లు సాధించాడు. అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు. బంగ్లాదేశ్ తో ఫైనల్లో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా తనజట్టు కు ప్రపంచకప్ అందించినంత పని చేశాడు. వ్రతం చెడినా ఫలితం దక్కిందన్న సామెతను వ్యక్తిగతంగా రాణించడం ద్వారా యశస్వి, రవి బిష్నోయ్ నిజం చేశారు.

అప్పుడు సీనియర్లు… ఇప్పుడు జూనియర్లు…

ఇంగ్లండ్ వేదికగా గత ఏడాది ముగిసిన వన్డే ప్రపంచకప్ టైటిల్ వేటకు భారీ అంచనాలతో పోటీకి దిగిన విరాట్ సేన…గ్రూప్ లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్ లూ నెగ్గింది.

ఓపెనర్ రోహిత్ శర్మ లీగ్ దశలోనే ఐదు సెంచరీలతో ప్రపంచకప్ రికార్డు నెలకొల్పాడు. అయితే న్యూజిలాండ్ తో ముగిసిన సెమీపైనల్లో పరాజయం పొందడం ద్వారా భారత జట్టు ఉత్తచేతులతో స్వదేశానికి తిరిగిరావాల్సి వచ్చింది.

గత ఏడాది విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టుకు ఎదురైన అనుభవమే ప్రియం గర్గ్ నాయకత్వంలోని భారత జూనియర్లకు సైతం ఎదురయ్యింది. సన్నాహక మ్యాచ్ లు, గ్రూప్ లీగ్ మ్యాచ్ ల్లో తిరుగులేని విజయాలు సాధిస్తున్న భారతజట్లు..అసలు సిసలు సెమీఫైనల్స్, ఫైనల్స్ లో బోల్తా కొట్టడం భారత క్రికెట్ బలహీనతగా మారిపోయింది.

మహిళాజట్టు పైనే భారత ఆశలు..

ఆస్ట్ర్రేలియా వేదికగా మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే మహిళా టీ-20 ప్రపంచకప్ లో భారతజట్టు సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టులో స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగేజ్, దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరీ గయక్వాడ్, అరుంధతి రెడ్డి లాంటి మేటి క్రికెటర్లున్నారు.

ప్రపంచకప్ కు సన్నాహకంగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా, రెండోర్యాంక్ ఇంగ్లండ్ జట్లపైన భారత్ సంచలన విజయాలు సాధించడం ద్వారా ప్రపంచకప్ టైటి్ల్ ఆశలు చిగురింప చేసింది.

కొత్త సంవత్సరం తొలి ప్రపంచకప్ లో భారత కుర్రాళ్ళు చేదు అనుభవాన్ని మిగిల్చినా..త్వరలో జరిగే మహిళా టీ-20 ప్రపంచకప్, అక్టోబర్లో జరిగే పురుషుల టీ-20 ప్రపంచకప్ లు భారత్ ను ఊరిస్తున్నాయి. రానున్న ప్రపంచకప్ టోర్నీలలో భారతజట్లు సాంప్రదాయ బలహీనతలను అధిగమించి విజేతలుగా నిలవాలని కోరుకొందాం.