16న కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం….

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 62 సీట్లతో విజయఢంకా మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే అధికారం చేపట్టనున్నారు. ముచ్చటగా మూడో సారి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

గత ఎన్నికల్లో 67 సీట్లతో విజయం సాధించి ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ సారి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి.

కాగా, ఈ సారి అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే సీఎంతో పాటు ఇతర మంత్రులెవరు ప్రమాణం చేస్తారో ఇంకా ఖరారు చేయలేదు. మంత్రి వర్గ కూర్పు ఆలస్యం అవుతున్న కారణంగానే ప్రమాణ స్వీకారం కూడా ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.