“అ!”తడికి నిర్మాత కావాలి

“అ!” సినిమాను క్రిటిక్స్ మెచ్చుకున్నారు. అంతవరకు కరెక్ట్. కానీ ఆ సినిమా కమర్షియల్ గా హిట్టయిందంటే మాత్రం చాలామంది ఒప్పుకోరు. అంతెందుకు, ఆ సినిమా ఇప్పటివరకు శాటిలైట్ కు నోచుకోలేదంటే, ఆ సినిమా సంగతేంటో ఈజీగా అర్థంచేసుకోవచ్చు. ఇలాంటి సినిమాకు సీక్వెల్ రాసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.

“అ!” సినిమాకు సీక్వెల్ రాశానని ప్రకటించుకున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి పార్ట్ తో పోలిస్తే, రెండో భాగం మరింత క్రేజీగా వచ్చిందని కూడా చెప్పుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ, నిర్మాత మాత్రం దొరకడం లేదంటూ వాపోయాడు ఈ దర్శకుడు.

మొదటి భాగం నచ్చి స్వయంగా నాని నిర్మాతగా మారాడు. వాల్ పోస్టర్ సినిమాస్ అనే బ్యానర్ పెట్టి “అ!” సినిమా నిర్మించాడు. కానీ అతడికి అది నష్టాలు మిగిల్చింది. అందుకే సీక్వెల్ కు అతడు దూరమయ్యాడు. లైట్ తీస్కో అని ప్రశాంత్ కు కూడా చెప్పేశాడు. కానీ ప్రశాంత్ ఊరుకోలేదు. సీక్వెల్ స్క్రిప్ట్ రాశాడు. ఇప్పుడు నిర్మాత కోసం వెదుకుతున్నాడు. నిర్మాత దొరికితే సీక్వెల్ సెట్స్ పైకి వస్తుంది, లేదంటే స్క్రిప్ట్ సెల్ఫ్ లో ఉంటుంది.