శ్రీవారి భక్తులకు శుభవార్త…. అందుబాటులోకి మరో సౌకర్యం

తిరుమల శ్రీవారి కళ్యాణాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి కళ్యాణానికి హాజరు కావాలంటే.. రకరకాలుగా భక్తులు ప్రయత్నాలు చేసుకోవాల్సి ఉంటుంది. మూడు నెలల ముందే ఆన్ లైన్ లో విడుదలయ్యే కోటాలో టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలా కాదు.. అప్పటికప్పుడు కావాలంటే అత్యున్నత స్థాయిలో పరిచయాలు ఉంటే తప్ప సాధ్యం కాదు.

కనీసం కళ్యాణానికి సంబంధించిన ప్రసాదాన్ని అయినా పొందుదామంటే కూడా.. సిఫారసు కావాల్సి ఉంటుంది. అది దొరకని వాళ్లు.. మామూలుగా కౌంటర్లలో దొరికే లడ్డూనే మహా ప్రసాదంగా భావించి తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అవుతుంటారు. ఇకపై.. అలాంటి పరిస్థితి ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది. కళ్యాణానికి హాజరు కాకున్నా.. ఆ ప్రసాదాన్ని ఎలాంటి సిఫారసు లేకుండా పొందే అవకాశాన్ని అమల్లోకి తెచ్చినట్టు తెలిపింది.

లడ్డూ వితరణ కేంద్రంలో 2 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి.. కళ్యాణోత్సవ ప్రసాదాన్ని భక్తులకు విక్రయిస్తున్నట్టు తెలిపింది. కావాల్సిన భక్తులు.. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

ఇటీవలే రాయితీపై లడ్డూలను ఇచ్చే విధానానికి స్వస్తి పలికిన తిరుమల తిరుపతి దేవస్థానం.. ఎన్ని లడ్డూలు కావాలన్నా కొనుక్కుని వెళ్లే అవకాశం కల్పించింది. ఫలితంగా.. దళారుల ప్రమేయాన్ని నివారించగలిగింది.

తాజాగా ఎలాంటి సిఫారసు లేకుండానే కళ్యాణోత్సవ లడ్డూ విక్రయాన్ని అందుబాటులోకి తేవడంపై భక్తులు ఆనందిస్తున్నారు.