Telugu Global
NEWS

భారత హాకీ కెప్టెన్ కు అరుదైన గౌరవం

మన్ ప్రీత్ కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అవార్డు భారత హాకీ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. 2019 సంవత్సరానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యుత్తమ ప్లేయర్ అవార్డు గెలుచుకొన్నాడు. ఈ గౌరవం సంపాదించిన భారత హాకీ తొలిప్లేయర్ గా నిలిచాడు. లాసానేలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధికారికంగా ఈ అవార్డులను ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా హాకీ అభిమానులు, మీడియా ప్రతినిధులు, ప్రముఖులతో నిర్వహించిన ఆన్ లైన్ పోలింగ్ లో మన్ […]

భారత హాకీ కెప్టెన్ కు అరుదైన గౌరవం
X
  • మన్ ప్రీత్ కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అవార్డు

భారత హాకీ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. 2019 సంవత్సరానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యుత్తమ ప్లేయర్ అవార్డు గెలుచుకొన్నాడు. ఈ గౌరవం సంపాదించిన భారత హాకీ తొలిప్లేయర్ గా నిలిచాడు.

లాసానేలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధికారికంగా ఈ అవార్డులను ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా హాకీ అభిమానులు, మీడియా ప్రతినిధులు, ప్రముఖులతో నిర్వహించిన ఆన్ లైన్ పోలింగ్ లో మన్ ప్రీత్ సింగ్ కు 32.5 శాతం ఓట్లు పోలయ్యాయి.

బెల్జియం ఆటగాడు ఆర్థర్ వాన్ డ్యూరెన్, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లూకాస్ విల్లాల నుంచి మన్ ప్రీత్ కు ప్రధానంగా పోటీ ఎదురయ్యింది. 27 సంవత్సరాల మన్ ప్రీత్ సింగ్ ప్రపంచ హాకీ అత్యుత్తమ మిడ్ ఫీల్డర్ గా కూడా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

భారత హాకీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన మన్ ప్రీత్ సారథ్యంలోనే భారత్ తన ర్యాంక్ ను అత్యుత్తమంగా 4కు మెరుగుపరచుకోడం తో పాటు.. 2020 టోక్యో ఒలింపిక్స్ కు సైతం అర్హత సంపాదించగలిగింది.

అంతేకాదు..ప్రపంచ నంబర్ వన్ బెల్జియం, మూడో ర్యాంకర్ నెదర్లాండ్స్ లాంటి జట్లపైన సైతం భారతజట్టు సంచలన విజయాలు సాధించింది. 2009లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య వివిధ విభాగాలలో ప్రపంచ అత్యుత్తమ హాకీ ప్లేయర్లకు అవార్డులు ఇచ్చే సాంప్రదాయాన్ని మొదలు పెట్టింది.

2011లో తన హాకీ కెరియర్ ప్రారంభించిన మన్ ప్రీత్ సింగ్ కు 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్ లో పాల్గొనడంతో పాటు..260 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన అరుదైన రికార్డు ఉంది.

తాను సాధించిన ఈ అవార్డును తనజట్టు సభ్యులకు అంకితమిస్తున్నట్లు మన్ ప్రీత్ ప్రకటించాడు. సహఆటగాళ్లు లేకపోతే తానులేనని సవినయంగా తెలిపాడు.

ప్రతిష్టాత్మక అవార్డు సాధించిన మన్ ప్రీత్ ను కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ, భారతహాకీ సమాఖ్య అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ అభినందించారు.

భారత యువమిడ్ ఫీల్డర్ వివేక్ సాగర్ ..యంగ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీ, మహిళా హాకీ స్ట్ర్రయికర్ లాల్ రైమ్ సయామీ యంగ్ రైజింగ్ స్టార్ అవార్డులకు ఎంపికకావడం విశేషం.

First Published:  13 Feb 2020 8:01 PM GMT
Next Story