చంద్ర‌బాబు చుట్టూ ఐటీ ఉచ్చు… అప్రూవ‌ర్‌గా మారిన మాజీ పీఎస్ ?

ఐటీశాఖ ప్రెస్‌నోట్ ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై జరిపిన దాడులతో బోగ‌స్ లావాదేవీల రాకెట్ బ‌య‌ట‌ప‌డింద‌ని ఐటీ శాఖ త‌న ప్రెస్‌నోట్‌లో ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించింది. ఈ రాకెట్‌కు 2వేల కోట్ల అక్ర‌మ లావాదేవీల‌తో క‌నెక్ష‌న్ ఉంద‌ని తెలిపింది. దీంతో దీని వెనుక ఉన్నది ఎవ‌రు? అనే చ‌ర్చ మొద‌లైంది.

ఇటీవ‌ల హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పూణే నగరాల్లో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వ‌హించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మూడు ఇన్ఫా కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేప‌ట్టింది. ఈ కంపెనీలు బోగస్ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా భారీగా అక్రమ లావాదేవీలు న‌డిపిన విష‌యం బ‌య‌ట‌పడింది. బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్ ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు ఐటీ శాఖ గుర్తించింది. కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ మెయిళ్లు, వాట్సాప్ మెసేజుల ద్వారా చేసిన లావాదేవీలు, విదేశీ లావాదేవీలు జరిపినట్లు తేలింది.

ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు పత్రాలు సృష్టించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 2,000 కోట్లు చేతులు మారినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. పన్ను లెక్కలకు దొరకకుండా రూ. 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధులు దారి మళ్లించారు.

బోగస్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లించారని అధికారులు గుర్తించారు. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు తేలింది. గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు స‌మాచారం. రూ 85 లక్షల అక్రమ నగదు, 75 లక్షల ఖరీదు చేసే నగలు, 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేశారు. ఇదంతా ప్రెస్ నోట్ స‌మాచారం.

ఇటీవ‌ల చంద్ర‌బాబు మాజీ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి శ్రీనివాస‌రావు ఇంటిపై ఐటీ దాడులు జ‌రిగాయి. ఆయ‌న ద‌గ్గ‌ర దొరికిన డైరీలతో పాటు ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌లో పూర్తి స‌మాచారం దొరికిన‌ట్లు తెలుస్తోంది. ఈ లింక్‌ను లాగితే చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో త్వ‌ర‌లోనే పక్కా ఆధారాలు సేక‌రించే ప‌నిలో ఐటీశాఖ ప‌డింది.

ఇటు శ్రీనివాస‌రావు పూర్తి వివ‌రాలు చెబుతాన‌ని…. కొంత స‌మ‌యం కావాల‌ని అడిగార‌ట‌. దీంతో ఆయ‌న ఇచ్చే స‌మాచారంతో  చంద్ర‌బాబు చుట్టూ ఉచ్చు బిగియడం ఖాయ‌మ‌ని అంటున్నారు.