కేసీఆర్ ను ఢీకొట్టే బీజేపీ నాయకుడెవరు?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే అని.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. బహిరంగంగా ప్రకటించారు కూడా.

కానీ దురదృష్టవశాత్తూ బీజేపీ ఆ విషయంలో ఘోరంగా విఫలమవుతోందన్న చర్చ సాగుతోంది. సిట్టింగ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ను మార్చి ఆయన స్థానంలో వేరొకరిని నియమించాలని యోచించింది. కానీ ఇంతవరకూ కేసీఆర్ కు సరితూగే నాయకుడిని బీజేపీ కనుగొనలేకపోయింది.

వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చగల నాయకుడి కోసం ఇప్పుడు బీజేపీ అధిష్టానం శోధన మొదలుపెట్టింది. ఈనెల చివరి నాటికి నియమించాలని కేంద్రంలోని బీజేపీ ఆలోచిస్తోంది.

ఇప్పటికే బీజేపీ మదిలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో మురళీధర్ రావు, ఎంపీలు బండి సంజయ్, అరవింద్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డిలున్నారు. కానీ బీజేపీ పెద్దలైన అమిత్ షా, జేపీనడ్డాలు ఈ నాయకులలో ఎవరితోనూ సంతోషంగా లేరు.. వీరెవరికీ రాష్ట్ర వ్యాప్తంగా తగినంత బలం, మాస్ ఫాలోయింగ్ లేదు.

అందుకే ప్రస్తుతం ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ను మార్చకుండా మరికొంత కాలం అతడినే కొనసాగించాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయినట్టు సమాచారం. ముందుగా బూత్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది.