క్రిష్ టైటిల్ తో మంచు మనోజ్ సినిమా

లాంగ్ గ్యాప్ తర్వాత నిన్న కొత్త సినిమా ప్రకటించాడు మంచు మనోజ్. ఈ సినిమా కోసం కొన్నాళ్ల కిందట ఈ హీరో కొత్త బ్యానర్ కూడా స్థాపించాడు. ఆ బ్యానర్ పై అహం బ్రహ్మస్మి అనే సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.

సినిమాను పాన్-ఇండియా లెవెల్లో తీయబోతున్నట్టు.. ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తీయబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అంతా బాగుంది కానీ, ఈ హడావుడిలో జనాలు ఓ చిన్న విషయం మరిచిపోయారు. మంచు మనోజ్ ప్రకటించిన ఆ టైటిల్ గతంలో క్రిష్ రిజిస్టర్ చేయించుకున్నాడు.

అవును.. సరిగ్గా రెండేళ్ల కిందట ఈ టైటిల్ ను క్రిష్ ప్రకటించాడు. ఆ టైటిల్ తో మహేష్ హీరోగా సినిమా అనుకున్నాడు. తర్వాత మెగా కాంపౌండ్ లో కూడా ప్రయత్నించాడు. చివరికి వరుణ్ తేజ్ హీరోగా సినిమాను చేయబోతున్నట్టు లీకులు కూడా వదిలాడు. విషయం ఎంత వరకు వెళ్లిందంటే.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారు.

కానీ ఆ తర్వాత ఆ కథ మరుగునపడిపోయింది. ఆ టైటిల్ కాలపరిమితి ముగిసింది. అలా క్రిష్ కాంపౌండ్ నుంచి బయటకొచ్చిన ఆ టైటిల్ ను మంచు మనోజ్ అందుకున్నాడు. తన సినిమాకు పెట్టుకున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయబోతున్నాడు. మార్చి 6న ఈ మూవీ లాంఛ్ అవుతుంది.