చంద్రబాబు అవినీతిని తవ్వడానికి బుల్‌డోజర్లు కావాలి…

చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేసి దాదాపు 2వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన సొమ్ము, బంగారం, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఆయనకు చెందిన పలు బ్యాంకు లాకర్లను కూడా సీజ్ చేశారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబు అవినీతిని తవ్వాలంటే గునపాలు, గడ్డపారలు సరిపోవని.. ఏకంగా బుల్‌డోజర్లు, జేసీబీలు తెప్పించాలని ఎద్దేవా చేశారు.

పోలవరం పనుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 15 కోట్ల రూపాయల విలువైన కాల్వ తవ్వకపు పనులను ఏకంగా 90కోట్ల రూపాయలకు పెంచి తనకు కావాల్సిన వారికి ఇచ్చారని ఆయన అన్నారు.

అవినీతి ఎలా చేయాలో చంద్రబాబుకు 40 సంవత్సరాల అనుభవం ఉందని.. అవినీతి పనులు చేయడంలో దేశంలో చంద్రబాబే నెంబర్ వన్ అని ఆయన అన్నారు. నారా లోకేష్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇద్దరూ మంచి స్నేహితులని అన్నారు. ఇప్పుడు బయటపడింది 2వేల కోట్లే అని.. దీనిపై లోతుగా విచారిస్తే ఇంకెన్ని వేల కోట్లు బయటపడతాయో తెలియదని వీర్రాజు అన్నారు.

పీఏ శ్రీనివాస్‌తో పార్టీకి సంబంధం లేదని టీడీపీ వాదిస్తోందని…. కానీ ఆయనేం బయట నిలబడే సెక్యూరిటీ కాదని.. ఎప్పుడూ చంద్రబాబును అంటి పెట్టుకొని తిరిగే పీఏ అని ఆయన గుర్తు చేశారు. ఎలాంటి అక్రమాలు లేకపోతే ఐటీ శాఖ అన్ని లాకర్లను సీజ్ ఎందుకు చేస్తుంది..? అసలు ఆయన ఇంట్లోకి అంత డబ్బు ఎలా వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు.

ఇప్పుడు శ్రీనివాస్ అక్రమాలను బయటపెట్టింది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు కదా…. అది కేంద్రం ఆధీనంలోని ఐటీ శాఖ అని వీర్రాజు గుర్తు చేశారు. అసలు 2 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలను ఐటీ శాఖ ఆరా తీస్తోందని ఆయన చెప్పారు. పోలవరానికి సంబంధించిన బినామీ కాంట్రాక్టులు శ్రీనివాస్‌కు చెందిన కంపెనీలకు దక్కాయని.. ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇచ్చిన 500 కోట్ల రూపాయలు తిరిగి శ్రీనివాస్ కంపెనీలకే వచ్చాయని ఆయన అన్నారు.

మరోవైపు చంద్రబాబు హయాంలో జరిగిన నీరు– చెట్టు పనుల్లో 25 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వీర్రాజు ఆరోపించారు. ఆయన హయాంలో జరిగిన అవినీతిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ చేస్తున్నాయని అన్నారు.

పోలవరం ఎడమ కాల్వలో 10 ప్యాకేజీలు ఉన్నాయని… వీటిలో 10 కోట్ల రూపాయల విలువైన పనులను 50 కోట్లకు అంచనాలు పెంచారని ఆయన అన్నారు. ఇలా పెంచడం ద్వారా వచ్చిన డబ్బు శ్రీనివాస్ ద్వారానే బయటకు తరలి వెళ్లిందని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా 4,500 కోట్ల రూపాయల విలువైన పోలవరం పనులను 5,350 కోట్ల రూపాయలకు పెంచారని.. అలా పెంచగా వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. కేవలం పోలవరమే కాకుండా రాష్ట్రంలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని అన్నారు.

నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ పథకం కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం 40 వేల కోట్లు ఇచ్చింది. ఈ పనుల్లో లెక్కలేనంత అవినీతి జరిగిందని ఆయన అన్నారు. ఈ డబ్బంతా శ్రీనివాస్‌ ద్వారానే కాకుండా.. ఇతర అక్రమార్కుల ద్వారా బయటకు వెళ్లిందన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత పోలవరం, హైడ్రోపవర్‌ జనరేషన్‌ పనులను కలిపి ఒక్క ప్యాకేజీ కింద టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో 800 కోట్లు తక్కువ కోట్‌ చేశారని ఆయన గుర్తు చేశారు.

మరోవైపు అమరావతిలో చదరపు మీటర్ పనులకు 10 వేలు ఖర్చు చేశారని అన్నారు. కానీ శాసనమండలిలో యూరినల్‌కు వెళితే పక్కన ఉన్న వ్యక్తి తగులుతుంటాడని… పైగా పై నుంచి నీళ్లు కారుతుంటాయని అన్నారు. అసలు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఇలాగేనా రాజధాని భవనాలను కట్టేదని ఆయన ప్రశ్నించారు.

ఇక యనమల రామకృష్ణుడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని…. ఆయనను ఎన్టీరామారావు కుమారుడు రామకృష్ణ చనిపోయిన తర్వాత యనమల రామకృష్ణుడిని వాళ్ల కుమారుడిగా చూసుకున్నారని… ఆయనకు రోజూ భోజనం పెట్టి కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారని గుర్తు చేశారు. సీటిచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి స్పీకర్‌ను కూడా చేశారని…. అంతా చేస్తే చంద్రబాబుతో కలిసి కుట్రపన్నారన్నారు. ఎన్టీయార్‌ను పదవీచ్యుతున్ని చేశారని దుయ్యబట్టారు. పోలవరం కెనాల్‌ పనుల్లో జరిగిన అవినీతిలో యనమల రామకృష్ణుడి వియ్యంకుడి భాగస్వామ్యం కూడా ఉందన్నారు. లోకేష్ మంత్రి వర్గంలోకి రావడం వల్ల తన ప్రాభవం తగ్గిందని.. యనమలకు లోకేష్ పై కోపం ఉందన్నారు.

ఏపీకి ఈ గతి పట్టడానికి ప్రధాన కారణం లోకేష్ అని… మంగళగిరి పేరు కూడా సరిగ్గా పలకలేని వ్యక్తి ఆయన అని ఎద్దేవా చేశారు సోము వీర్రాజు. ఐటీ దాడులు.. వైఎస్సార్‌సీపీకి, లోకేశ్‌ బాబుకు సంబంధించిన విషయం కాదని…. ఒక అవినీతి పరుడికి… భారత ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని అన్నారు.

ఐటీ శాఖ ఎంత డబ్బు, ఎన్ని లాకర్లు సీల్‌ చేశారు అనే అంశాలని కూడా ప్రెస్‌నోట్‌లో ప్రస్తావించారని గుర్తుచేశారు. అయినా సరే లోకేష్ ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారని…. ఏదో ఒక రోజు ఆయన చేసిన అవినీతి అతని మెడకు చుట్టుకోవడం ఖాయమని సోము వీర్రాజు అన్నారు.