బొత్స.. మరోసారి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ.. మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే.. రాజధాని వ్యవహారంలో ఆయన చేసిన కామెంట్లు.. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఆయన నోటి వెంట వచ్చిన మాటల ప్రకారమే.. అడుగులు పడుతున్నాయి. తాజాగా.. అలాంటి మరో కొత్త రాజకీయ పరిణామం.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ సంచలనంగా మారుతోంది. దీనికి సంబంధించి బొత్స అంటున్న మాట.. సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

కేంద్ర మంత్రివర్గంలో చేరాలని ఆహ్వానం వస్తే.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు బొత్స. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. దీని కోసం ఎవరితో అయినా సత్సంబంధాలు పెట్టుకునేందుకు అభ్యంతరం లేదని ఆయన తేల్చి చెప్పారు. అసలు కేంద్రంతో ఎందుకు ఘర్షణ పడాలని బొత్స ప్రశ్నిస్తున్నారు. విశాఖలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఇలా వ్యాఖ్యలు చేసి.. మళ్లీ కొత్త చర్చకు తెర తీశారు.

ఇంకో విషయం.. బీజేపీతో మీ సంబంధాల పరిస్థితి గురించి చెప్పండి బొత్స గారూ.. అని ఓ విలేకరి అడగంగానే.. ఆయన చెప్పిన సమాధానం కూడా అంగీకరించేదిగానే ఉంది. తాము బీజేపీతో అంటి పెట్టుకుని ఉండడం లేదని… అలా అని దూరంగానూ లేమని బొత్స అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పారు. ఈ పరిణామం.. ముందు ముందు సరికొత్త రాజకీయ సమీకరణాల ఏర్పాటుకు సూచికగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పార్టీ పరంగా ఎవరి అభిప్రాయాలు వారివి.. కానీ కేంద్రంతో సన్నిహితంగా ఉంటేనే.. మన హక్కుగా నిధులు మరింతగా సాధించుకునే అవకాశం ఉంటుందన్నది.. బొత్స అభిప్రాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు.