ఓవర్ నైట్ స్టారైన కన్నడ రైతు

జమైకాకు చెందిన ఉస్సేన్ బోల్ట్ గురించి తెలియని వారుండరేమో…. చిరుతను మించిన వేగంతో పరుగెత్తుతూ ఒలంపిక్స్ లో ఎన్నో బంగారు పతకాలను కొల్లగొట్టాడు. వంద మీటర్లు, రెండొందల మీటర్లు.. ఏ పరుగు పందెంలోనైనా బోల్టే ముందుంటాడు.

సరికొత్త రికార్డులతో పరుగు పందెంలో సవాల్ విసిరేవాడు. 100మీటర్ల పరుగు పందాన్ని 9.58 సెకన్లలో చేరి బొల్ట్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ ఒలంపిక్స్ లో బోల్ట్ పేరిటే ప్రపంచ రికార్డు నమోదై ఉంది. అయితే ఈ రికార్డును ఓ సామాన్య రైతు బ్రేక్ చేశాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

కర్ణాటకలోని మూడబమద్రి పట్టణానికి చెందిన శ్రీనివాస్ గౌడ (28) ఓవర్ నైట్ సెలబ్రెటీగా మారాడు. ప్రతియేటా దక్షిణ కర్ణాటకలో జరిగే కంబాళ పోటీలో…. శ్రీనివాస్ గౌడ పాల్గొన్నాడు. ఈ పోటీలో మనుషులు దున్నపోతులతో సహా పరుగులు తీయాల్సి ఉంటుంది. ఈమేరకు శ్రీనివాస్ గౌడ దున్నపోతులతో సమానంగా పరిగెత్తాడు. 142.4మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో పూర్తి చేశాడు. దీనిని 100మీటర్లకు కాలిక్యులేట్ చేస్తే కేవలం 9.55 సెకన్లలో గమ్యాన్ని పూర్తి చేసినట్లే. దీంతో వేగంలో బోల్ట్ కంటే 0.3 సెకన్లు అధికంగా పరిగెత్తినట్లు. ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

ఉస్సేన్ బోల్ట్ రికార్డు గురించి తనకు తెలియదని శ్రీనివాస్ తెలిపాడు. తాను ప్రతియేటా కర్ణాటకలో దున్నపోతులతో నిర్వహించే కంబాళ రేసులో గెలవాలనే పాల్గొంటున్నట్లు చెప్పాడు. అయితే తాను ఎలాంటి రికార్డు కోసం పరిగెత్తలేదని శ్రీనివాస్ అంటున్నాడు.

అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రముఖుల నుంచి శ్రీనివాస్ గౌడ కు ప్రశంసలు లభిస్తున్నాయి. దీంతో శ్రీనివాస్ ఒక్కరోజులోనే సెలబ్రెటీగా మారిపోయాడు.