అమిత్ షా…. జగన్ మధ్య చర్చలో ఆ కీలక విషయాలు ఇవేనా?

ఇటీవలే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పది కీలక అంశాలపై రిప్రెజెంటేషన్ ఇచ్చి.. రాష్ట్రానికి సహకరించాలని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ సీఎం సమావేశం అయ్యారు. కీలక విషయాలపై చర్చించారు… పెండింగ్ నిధుల విషయం మాత్రమే కాదు.. కేంద్ర హోం శాఖ పరిధిలోకి వచ్చే ముఖ్యమైన విషయాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

పోలవరానికి నిధులు.. పెండింగ్ నిధుల క్లియరెన్సు.. వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులను మరోసారి జగన్ ప్రస్తావించారు. వీటి విడుదలకు ప్రత్యేక చొరవ చూపాలని అమిత్ షా ను కోరారు. అలాగే.. 15వ ఆర్థిక సంఘం చెప్పిన మేరకు.. కేంద్రమే స్వయంగా హోదా విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని.. విభజన సమయంలో నాటి కేంద్రం ఇచ్చిన హామీ మేరకు.. ఇప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తున్న పరిపాలన వికేంద్రీకరణ.. కర్నూలుకు హై కోర్టు తరలింపు.. శాసనమండలి రద్దు బిల్లులకు కేంద్రం త్వరితగతిన ఆమోదం తెలపాలని జగన్.. అమిత్ షా ను కోరారు. ఈ సందర్భంగా.. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. రాయలసీమలో శాశ్వతంగా హై కోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని.. ఆ మేరకు తాము తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదింపజేయాలని జగన్ కోరారు.

సంక్షేమ రంగంలో తన ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించిన ముఖ్యమంత్రి.. మరికొన్ని సమస్యలనూ అమిత్ షాకు నివేదించారు. పోలీసు వ్యవస్థకు సంబంధించి.. హైదరాబాద్ లోనే అన్ని మౌలిక వసతులు ఉండిపోయాయని.. వాటి తరలింపు భారంగా ఉందని.. కేంద్ర హోం శాఖ మంత్రిగా ఈ విషయంలో కాస్త చొరవ చూపి.. రాష్ట్రానికి సహాయం చేయాలని అమిత్ షాను జగన్ కోరారు. ఇవీ.. జగన్, అమిత్ షా భేటీలో ముఖ్యాంశాలు అని చెబుతున్నారు.