కేసీఆర్ బర్త్ డే…. హంగామా మామూలుగా లేదుగా…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజుకు.. ప్రభుత్వ పరంగా ప్రత్యేక కార్యక్రమాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. ఏకంగా కోటి మొక్కలు నాటేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజున అంతా మొక్కలు నాటండి అని కేసీఆర్ తనయుడు, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా అనూహ్య రీతిలో.. ఈ కార్యక్రమంలో భాగమవుతున్నారు.

ఇందులో భాగంగా.. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ ప్రజలు.. రేపు అంటే.. ఫిబ్రవరి 17న వైభవంగా తమ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. 66వ పుట్టిన రోజు సందర్భంగా.. 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 2,600 మంది కార్యకర్తలు, అభిమానులు అంతా కలిసి.. ఓ క్రమ పద్ధతిలో నిలవనున్నారు. ఏరియల్ వ్యూ లో చూస్తే.. అది కేసీఆర్ ముఖ చిత్రాన్ని పోలి ఉంటుందట.

గజ్వేల్ లోని ఎడ్యుకేషన్ హబ్ వేదికగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పార్టీ అగ్రనేతలు మానిటర్ చేస్తున్నారు. మొక్కలు నాటడంతో పాటుగా.. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా.. తమ అభిమానాన్ని చాటుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు.. కేసీఆర్ పై ఉన్న క్రేజ్ ను చెప్పకనే చెబుతున్నాయి.

మరోవైపు.. గజ్వేల్ లోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున కోటి మొక్కలు నాటేలా జరుగుతున్న ప్రయత్నం కూడా సామాన్యమైందేమీ కాదు.

ఇంతలా.. కేసీఆర్ పై అభిమానం చాటుకునేందుకు గులాబీ దండు కదులుతున్న తీరు.. జనానికి ఆసక్తిని కలిగిస్తోంది.