మా లెక్క మాది… బీజేపీతో జగన్ దోస్తీపై పవన్ హాట్ కామెంట్స్

ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు మోడీషాలు, పవన్ కళ్యాణ్ ఒక జట్టు అన్నట్టు. అయితే అనూహ్యంగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిశారు. బీజేపీతో జగన్ సాన్నిహిత్యం ఇప్పుడు ఏపీలో కొత్త చర్చకు దారితీస్తోంది.

అమరావతి రైతాంగానికి హామీ ఇస్తూ బీజేపీతో కలిసి ఉద్యమాలు చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. శనివారం అమరావతి పరిధిలోని గ్రామాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ కు ఓ వింత ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత పరిణామాలతో బీజేపీతో అధికార వైసీపీ జతకడితే జనసేన ఆటలో అరటిపండుగా మారుతుందా? మీరేం చేస్తారంటూ? మీడియా ప్రశ్నించడంతో పవన్ స్పందించాడు.

ప్రస్తుతానికి బీజేపీ-జనసేనకు వచ్చిన ముప్పేమీ లేదని పవన్ క్లారిటీ ఇచ్చాడు. బీజేపీ, జనసేన బంధం బలంగా ఉందని.. భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తాయని పవన్ పేర్కొన్నాడు.

ఇక ఢిల్లీలో సీఎం జగన్ కలుస్తున్నది బీజేపీ నేతలను కాదని.. భారతీయ ప్రభుత్వ అధినేతలను అని గుర్తించాలని .. వేరే ఊహాగానాలు అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నాడు. బీజేపీ విషయంలో క్లారిటీ ఉంది కాబట్టే … పొత్తు పెట్టుకున్నానని స్పష్టం చేశాడు.