రామ్ చరణ్ ఖాతాలో మరో రీమేక్

తన బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్ పై ఇప్పటికే ఓ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు రామ్ చరణ్. ఇప్పుడీ హీరో మరో సినిమా రీమేక్ రైట్స్ కూడా కొనుగోలు చేశాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ తీసుకున్నాడు. ఈ మేరకు ఒప్పందం కూడా పూర్తయింది. తెలుగులో ఈ సినిమాను డబ్బింగ్ చేయకూడదనే కండిషన్ కూడా ఇందులో ఉంది.

మలయాళంలో పృధ్వీరాజ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సినిమా స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. ఒక స్టార్ హీరో ఉంటాడు. అతడికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ అభిమానుల్లో డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసే అధికారి కూడా ఉంటాడు. ఓసారి హీరోకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ పని పడుతుంది. అదే టైమ్ లో అధికారి సీన్ లోకి వస్తాడు. అభిమాన హీరో వస్తున్నాడని అనుకుంటాడు. కానీ ఇంకేదో జరుగుతుంది. మొత్తమ్మీద ఇద్దరి మధ్య ఇగో పెరుగుతుంది. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా మలయాళంలో పెద్ద హిట్టయింది.

ఈ సినిమా చరణ్ ను ఎట్రాక్ట్ చేసింది. అందుకే వెంటనే రీమేక్ రైట్స్ కొనుగోలు చేశాడు. ఇందులో తనే హీరోగా నటిస్తాడా లేక మరో మెగా హీరోను పెడతాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇప్పటికే లూసిఫర్ రీమేక్ రైట్స్ తీసుకున్నాడు చరణ్. మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేయబోతున్నాడు. కొరటాల సినిమా తర్వాత సెట్స్ పైకొచ్చేది ఇదే. ఈ మూవీ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పై క్లారిటీ వస్తుంది.