బాలకృష్ణ భార్య సంతకం ఫోర్జరీ…. ఎలా బయటపడిందంటే !

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ భార్య వసుంధరా దేవి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా ఆ సంతకంతో మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేయమంటూ బ్యాంకు అధికారులకు దరఖాస్తు చేయడం గమనార్హం. బ్యాంకు అధికారుల అప్రమత్తంతో ఈ విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రిలేషన్‌షిప్ మేనేజర్లైన శ్రీనివాస్, ఫణీంద్రలు ఈ నెల 13న బాలకృష్ణ అకౌంటెంట్ వెలిగల సుబ్బారావుకు కాల్ చేశారు. వసుంధర దేవి ఖాతాకు సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ వచ్చిందని.. ఆ సదుపాయాన్ని యాక్టివేట్ చేయాలా అని అడిగారు. తాము ఎలాంటి దరఖాస్తు చేయలేదని… యాక్టివేట్ చేయవద్దని ఆయన బదులిచ్చారు. మరో సారి కన్ఫార్మ్ చేసుకోవడానికి వసుంధరకు కాల్ చేయగా ఆమె కూడా ఇదే విషయాన్ని బ్యాంకు మేనేజర్‌కు చెప్పారు.

దీంతో అసలు దరఖాస్తు ఎలా వచ్చిందనే విషయంపై విచారణ చేపట్టారు. బాలకృష్ణ వద్ద ఇటీవలే జూనియర్ అకౌంటెంట్‌గా జాయిన్ అయిన కొర్రి శివ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డట్లు గుర్తించారు. వెంటనే సుబ్బారావు జూబ్లీ హిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివ కోసం గాలిస్తున్నారు. కాగా, శివ అనే వ్యక్తి బాలకష్ణ దగ్గర నెల క్రితమే పనిలో చేరినట్లు గుర్తించారు.