కరీంనగర్‌కు ఏమైంది..? వరుస ఘటనలతో కలకలం..!

కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండీలో గత రెండు రోజులుగా పలు ప్రమాదాల్లో మరణాలు సంభవించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మానేరు వంతెన పైనుంచి కారు బోల్తా పడటంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరణించగా.. అతని భార్యకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సహాయం చేయడానికి వచ్చిన కానిస్టేబుల్ బ్రిడ్జిపై నుంచి జారి పడి మృత్యువాతపడ్డాడు.

అదే రోజు రాత్రి ఒక ద్విచక్రవాహనం అదుపుతప్పి కాకతీయ కాల్వలో పడటంతో దంపతులు నీటిలో కొట్టుకొని పోయారు. ఈ ఘటనలో భర్త ప్రాణాలతో బయటపడగా.. భార్య కీర్తన (27) నీటిలో కొట్టుకొని పోయింది. ఒక శుభకార్యం కోసం కరీంనగర్ వచ్చిన వీళ్లు.. ద్విచక్రవాహనంపై ఎల్ఎండీ కాలనీలోని తాపాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బండి నడుపుతున్న భర్త ప్రదీప్ కళ్లల్లో పురుగుపడటంతో బైక్ అదుపుతప్పి కాల్వలో పడింది.

తాజాగా కారు కలకలం

ఇక తాజాగా కాకతీయ కాల్వలో ఒక కారు బయటపడింది. కాకతీయ కాల్వకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రవాహం తగ్గి కాల్వలో కారు కనపడింది. అక్కడకు చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మూడు మృతదేహాలను కారులో కనుగొన్నారు. 15 రోజుల క్రితమే కాలువలో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా అది కరీంనగర్ బ్యాంకు కాలనీకి చెందిన నర్రె శ్రీనివాసరెడ్డిదిగా గుర్తించారు.