ఆ కారులో శవాలు… ఎమ్మెల్యే సోదరి కుటుంబానివే..!

వాళ్లు ఇంటి నుంచి బయలుదేరి 20 రోజులయ్యింది. ఇన్నాళ్లయినా వారి గురించి వాకబు చేసిన వాళ్లు గానీ.. అదృశ్యమయ్యారని పిర్యాదు చేసిన వాళ్లు కూడా లేరు. చివరకు పక్కింటి వాళ్లు, సన్నిహితులు కూడా వారి ఆచూకీ తెలుసుకోవడానికి పెద్దగా ప్రయత్నించలేదు. దానికి కారణం వారి జీవనశైలే..! అలాగని వాళ్లేం అనామకులు కాదు.. స్వయానా ఒక ఎమ్మెల్యే సోదరి కుటుంబం. కుటుంబ పెద్ద వ్యాపారి, అతని భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. వారి కూతురు వైద్య విద్యార్థిని. అయినా వేరే కేసు విచారణ సందర్భంగా వీరి మరణాలు బయట ప్రపంచానికి తెలియడం గమనార్హం.

పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి రాధ. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా.. భర్త కరీంనగర్‌లో ఎరువుల వ్యాపారం చేస్తున్నాడు. వీరి కుమార్తె వినయశ్రీ ప్రస్తుతం నిజామాబాద్‌లోని ఒక కళాశాలలో బీడీఎస్ చదువుతోంది. గత నెల 27వ తేదీన వీళ్లు ఊరికి వెళ్తున్నట్లు సన్నిహితులకు చెప్పారు. ఆ తర్వాత కానరాకుండా పోయారు. 20 రోజులు గడిచినా వీరి గురించి ఎవరూ ఆరా తీయలేదు.

కాగా, కరీంనగర్ సమీపంలోని కాకతీయ కాల్వకు అధికారులు నీటి విడుదల నిలిపివేయడంతో.. కాల్వలో వీరి కారు పైకి కనపడింది. మానేరు డ్యాం ఎస్ఐ తన సిబ్బందితో కారును పరిశీలించగా.. వీరి ముగ్గురి మృతదేహాలు, బ్యాగు, నగలు, సెల్ ఫోన్లు దొరికాయి. కారు నెంబర్ ఆధారంగా వీళ్లు కరీంనగర్ వాసులని గుర్తించారు. మృతి చెందిన కుటుంబం పెద్దపల్లి ఎమ్మెల్యేకి స్వయానా సోదరి అని తెలిసి బంధువులకు సమాచారం అందించారు.

అందుకే తెలియలేదు..!

సత్యనారయణ రెడ్డి కుటుంబం స్థానికంగా అందరితో కలివిడిగా ఉండేవాళ్లు. కాకపోతే అప్పుడప్పుడూ కుటుంబ సమేతంగా కారులో తీర్థయాత్రలకు వెళ్తుంటారు. అలాగే గతనెల 27న ఇంటి నుంచి బయలుదేరారు. చాలా రోజుల నుంచి ఇంటికి రాకపోయేసరికి ఎక్కడికో విహారయాత్రకు వెళ్లుంటారనే అందరూ భావించారు. సన్నిహితులకు కొంత మందికి అనుమానం వచ్చి ఆరా తీయడానికి ప్రయత్నించినా ఎవరిని అడగాలో తెలియక ఊరుకున్నారు. అందుకే వాళ్ల అదృశ్యంపై ఎలాంటి పిర్యాదులు అందలేదు.

తన సోదరి కుటుంబం మృత్యువాత పడటంపై ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని.. వారికి శత్రువులు కూడా ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు.