శర్వానంద్ కు జాను నేర్పిన పాఠం

జాను లాంటి రీమేక్ సబ్జెక్ట్ ఒప్పుకోవడానికి కారణం దిల్ రాజు మాత్రమే.

ఆయన ఉన్నాడు కాబట్టే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను….

జాను ప్రమోషన్ లో శర్వానంద్ పదే పదే చెప్పిన మాటిది. సినిమా రిలీజై ఫ్లాప్ అయిన నేపథ్యంలో.. ఇప్పుడీ మాటల్ని మరోసారి రిపీట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం మొహమాటానికి పోయి శర్వానంద్ జాను సినిమా చేశాడనే విషయం రిలీజ్ తర్వాత జనాలకు అర్థమైంది.

ఈ సినిమాతో శర్వా ఖాతాలో మరో ఫ్లాప్ చేరిపోయింది. పడి పడి లేచే మనసు, రణరంగం సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్న ఈ హీరో.. జానుతో ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టినట్టయింది. ఈ సినిమా ప్రభావంతో ఇకపై ఎలాంటి ప్రలోభాలు, మొహమాటాలకు పోకూడదని శర్వా కాస్త గట్టిగా నిర్ణయించుకున్నట్టుంది.

ప్రస్తుతం శర్వానంద్ చేతిలో శ్రీకారం అనే సినిమాతో పాటు.. ఓ ద్విభాషా చిత్రం ఉంది. కమిట్ అయ్యాడు కాబట్టి ఈ రెండూ పూర్తిచేయాల్సిందే. ఈ రెండు సినిమాల తర్వాత శర్వా చేయబోయే సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుందని ఆశిద్దాం.