ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘విడాకుల’ వ్యాఖ్యలపై మండిపడ్డ సోనమ్ కపూర్..!

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ విడాకులపై చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఇలాంటి తెలివితక్కువ వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆదివారం (ఫిబ్రవరి 16) ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భగవత్ ప్రసంగిస్తూ.. బాగా చదువుకున్న, ధనవంతుల కుటుంబాల్లోనే విడాకులు ఎక్కువగా తీసుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. చదువుకున్న వాళ్లకు బాగా పొగరు ఉంటుందని.. వారికి సర్థుకుపోయే తత్వం ఉండదని, పొగరు బాగా ఉంటుందని.. ఆ గుణాలే విడాకులకు దారి తీస్తాయని భగవత్ వ్యాఖ్యానించారు. వీరి వల్లే సమాజం కూడా పతనమవుతోందని అన్నారు.

మోహన్ భగవత్ మాట్లాడిన మాటలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ జతచేసిన సోనమ్ కపూర్.. ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇలాంటి తెలివితక్కువ మాటలు ఈ మనిషి ఎలా మాట్లాడతారు. ఇవి పూర్తిగా వెనుకబాటుతనాన్ని సూచించే మాటలని సోనమ్ తన ట్విట్టర్‌లో స్పందించారు.

కాగా, మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా వాళ్లందరూ కుటుంబ సమేతంగా అక్కడ ఉండటం గమనార్హం.