30 కోట్ల సినిమాకు 9 కోట్ల షేర్

క్రేజ్ ఉన్న ఏ సినిమాకైనా మొదటి వారాంతంలో వచ్చిన వసూళ్లే పక్కా. దాదాపు 40శాతం రెవెన్యూ మొదటి 3 రోజుల నుంచి రాకపోతే, ఆ తర్వాత సినిమా హిట్టయినా నిర్మాతకు చేకూరే ప్రయోజనం అంతంతమాత్రమే. ఫ్లాప్ అయితే ఇక నాలుగో రోజు నుంచి నష్టాలు లెక్కేసుకోవాల్సిందే. వరల్డ్ ఫేమస్ లవర్ పరిస్థితి దాదాపు ఇదే.

విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాను వరల్డ్ వైడ్ 30 కోట్ల రూపాయలకు అమ్మారు. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. కనీసం 13 కోట్ల రూపాయలు వచ్చి, హిట్ టాక్ వస్తే బ్రేక్-ఈవెన్ గురించి ఆలోచించొచ్చు. కానీ ఇక్కడ ఆ స్కోప్ లేదు. కాబట్టి విడుదలైన 3 రోజులకే ఈ సినిమా ఫ్లాప్ అంటూ తేల్చిపడేసింది ట్రేడ్.

మొదటి రోజు ఈ సినిమాకు 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అది కాస్త డీసెంట్ మొత్తమే. కానీ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేయడంతో రెండో రోజు నుంచే ఆక్యుపెన్సీ పడిపోయింది. అలా ఆదివారం ముగిసేనాటికి ఈ సినిమా పూర్తిగా పక్కకెళ్లిపోయింది. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ కెరీర్ లో అతడికి స్టార్ డమ్ వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ ఫ్లాప్ నోటా మాత్రమే. ఇప్పుడా రికార్డును వరల్డ్ ఫేమస్ లవర్ అధిగమించేలా ఉన్నాడు.