‘బహిష్టు సమయంలో వంట చేసే మహిళ వచ్చే జన్మలో కుక్కలా పుడుతుంది’

ఈ మధ్య స్వాములుగా, రుషులుగా, అవతార పురుషులుగా చెప్పుకునే కొంత మంది మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. పైగా వారి మాటలను నిజమేనని నమ్మే శిష్యగణం కూడా ఉండటం గమనార్హం.

తాజాగా స్వామినారాయణ భుజ్ మందిర్‌కు చెందిన స్వామీ కృష్ణస్వరూప్ దాస్‌జీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. స్త్రీలపట్ల ఆయనకు ఉన్న చులకన భావాన్ని ఆ వ్యాఖ్యలు ప్రతిబింభిస్తున్నాయి.

‘మహిళ బహిష్టు సమయంలో చేసిన వంట ఒక్క సారైనా తినే మగాళ్లు వచ్చే జన్మలో ఎద్దులా పుడతారని.. అలాగే బహిష్టు సమయంలో వంట చేసే మహిళ వచ్చే జన్మలో కుక్కలా పుడుతుంది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్‌లోని భుజ్ ఇన్‌స్టిట్యూట్‌లో 68 మంది విద్యార్థునులను వివస్త్రలుగా చేసి వారు బహిష్టులో ఉన్నారో లేదో తెలుసుకునే ప్రయత్నం చేసిన ఘటన ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శల పాలయ్యింది. మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ క్రమంలో స్వామీజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంకా స్వామీజీ ఏమన్నారంటే.. నేను 10 సంవత్సరాల నుంచి తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాను.. కానీ ఏనాడు ఇలాంటి విషయాలను చెప్పలేదు. మన మతంలో ఉన్న రహస్యాలను బహిర్గతం చేయడం మంచిది కాదనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను… కానీ ఇక ఇప్పుడు బహిష్టు గురించి చెప్పక తప్పట్లేదన్నారు.

మగవాళ్లు అందుకే వంట చేయడం నేర్చుకోవాలని.. తద్వారా బహిష్టు మహిళల వంట తినకుండా సొంతగా వంట చేసుకోవాలని ఆయన సూచించారు.