2021 జూనియర్ ప్రపంచకప్ వేదిక భారత్

  • 2016 లో లక్నో వేదికగా తొలిసారి జూనియర్ ప్రపంచకప్

వచ్చే ఏడాది జరిగే 2021 జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి వేదికగా భారత్ ఎంపికయ్యింది. భువనేశ్వర్ లోని కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జూనియర్ ప్రపంచకప్ టోర్నీని భారత హాకీ సమాఖ్య నిర్వహించనుంది.

2016 లో లక్నో వేదికగా జూనియర్ ప్రపంచకప్ కు తొలిసారిగా ఆతిథ్యమిచ్చిన భారత్ …రెండోసారి టోర్నీని నిర్వహించే అవకాశాన్ని దక్కించుకొంది.

ప్రపంచంలోని 16 అత్యుత్తమ జట్ల మధ్య జరిగే ఈటోర్నీలో యూరోప్ కు చెందిన ఆరు, ఆసియాకు చెందిన నాలుగు, ఆతిథ్య భారత్ తో పాటు..పాన్ అమెరికా, ఆఫ్రికా, ఓషియానా దేశాలకు చెందిన రెండేసి జట్లు చొప్పున తలపడనున్నాయి.

ఇప్పటికే యూరోయన్ జోన్ పోటీల నుంచి అర్హత సాధించిన జట్లలో జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, స్పెయిన్ , బెల్జియం ఉన్నాయి.

జూనియర్ ప్రపంచకప్ హాకీని ఇప్పటికే రెండుసార్లు నెగ్గిన రికార్డు ఉన్న భారత్…ఆతిథ్య దేశం హోదాలో మరోసారి టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో ఉంది.

2018 సీనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీకి విజయవంతంగా ఆతిథ్యమిచ్చిన కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగానే జూనియర్ ప్రపంచకప్ ను సైతం నిర్వహించనున్నారు.