చంద్రబాబుపై జగన్ సెటైర్లు..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఇవాళ కర్నూలులో మూడో విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి మేలు చేసే పథకాలు ప్రవేశపెట్టామన్నారు.

ఇంత మంచి పాలన, సంక్షేమ పథకాలను చూసి కొంత మందికి అసూయ పుట్టుకొస్తోందని… వారు ఓర్వలేక పోతున్నారంటూ పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఆరోగ్యశ్రీలో 2వేలకు పైగా వ్యాదులకు చికిత్సలు చేయిస్తున్నామని… చివరకు క్యాన్సర్‌కు కూడా వైద్యం ఉందనీ… కానీ అసూయతో కూడిన కడుపు మంటకు మాత్రం ఎలాంటి చికిత్స లేదని ఎద్దేవా చేశారు.

కంటి వెలుగులో కళ్లకు చికిత్స అందించవచ్చు కానీ… చెడు దృష్టిని మాత్రం తీసేయలేమని అన్నారు. వయసు మళ్లిన వాళ్లకు కూడా చికిత్స ఉంది.. కానీ మెదడు కుళ్లిన వాళ్లకు ఏం చికిత్స చేస్తామని జగన్ అన్నారు. పైగా అలాంటి లక్షణాలున్న వారిని మహానుభావులుగా చూపించే మీడియా సంస్థలు ఉన్నాయని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఇన్ని రకాలుగా ఆటంకాలు కలిగిస్తున్నా.. మీ అందరి కోసం తాను నిజాయితీగా పని చేస్తున్నానని ఆయన అన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలు గౌరవిస్తూనే.. అందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని జగన్ అన్నారు.

ప్రస్తుతం చదువులు, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం మీద దృష్టిపెట్టామని… మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 85 శాతం పైగా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.