బాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడితే…. జగన్ గాడిన పెడుతున్నారు….

అప్పులు.. దారీ తెన్నూలేని అధికార వ్యవస్థ సీఎం జగన్‌కు ఆహ్వానం పలికాయని.. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టి అప్పగించారని… ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ విజయవాడలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. గాడి తప్పిన పాలనను అతి తక్కువ కాలంలో సీఎం జగన్ పట్టాలెక్కించారని కొనియాడారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతీ హామీని వైఎస్ జగన్ క్రమక్రమంగా అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్‌దే అని ఆయన చెప్పారు. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని… ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆయన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని.. అతని పాలనను ఒక సలహాదారుగా దగ్గర నుంచి గమనిస్తున్న నాకు ఆ విషయం అర్థమవుతోందని సజ్జల అభిప్రాయపడ్డారు.

వైసీపీ మేనిఫెస్టోలో రహస్యాలేమీ లేవు.. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ తెలుసుకున్న విషయాలనే మేనిఫెస్టోలో పెట్టారని ఆయన అన్నారు. 2014లో రుణమాఫీ సాధ్యం కాదని దాని జోలికి వెళ్లలేదన్నారు. కాని రైతులకు స్వాంతన చేకూర్చాలనే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కరువు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రైతు భరోసా ప్రవేశపెట్టామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడం.. అమ్మఒడి వల్ల అనేక మంది లబ్దిపొందుతున్నారని సజ్జల చెప్పారు. జగన్ ఒక నాయకుడిగా ఉండాలని కోరుకోట్లేదని.. ప్రజల మనిషిగా నిలిచిపోవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు రాష్ట్రాన్ని 2 లక్షల 60 వేల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టేశారని… 60 వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చూపించారని అన్నారు. ఆయన సీఎం అయ్యాక ఏ ఒక్క ఆదాయ వనరు కూడా సృష్టించలేదని చెప్పారు. అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడంతో పాలన కూడా కుంటుపడిందని విమర్శించారు. గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత ప్రజలు నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గిపోయిందని.. పాలనలో రాజకీయ నాయకుల జోక్యం కూడా తగ్గుతుందని ఆయన చెప్పారు.

రాజధాని ఫలానా చోట కట్టాలని చంద్రబాబు ఏనాడూ అనుకోలేదని.. బినామీల కోసమే ఆయన అదంతా చేస్తున్నట్లు మాకు చాన్నాళ్ల క్రితమే అర్థమయ్యిందని సజ్జల అన్నారు. చంద్రబాబు ఆలోచన ప్రకారం రాజధాని కోసం లక్ష కోట్ల రూపాయలు కావాలి. అయితే అంత డబ్బు ఒకే చోట పెట్టడం అవసరమా అని వైఎస జగన్ పాలన వికేంద్రీకరణకు మొగ్గు చూపినట్లు సజ్జల స్పష్టం చేశారు.