ఒక వేదికపై… రాష్ట్ర మంత్రి కౌంటర్ కు… కేంద్ర మంత్రి ఎన్ కౌంటర్

హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ లో.. శాటిలైట్ స్టేషన్ నిర్మాణానికి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన ఈ ఘటన.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కార్యక్రమానికి పీయూష్ తో పాటు సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రి తలసాని కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్రం దక్షిణ తెలంగాణపై వివక్ష చూపిస్తోందంటూ రాష్ట్ర మంత్రి తలసాని.. సభా వేదికపైనే విమర్శలు చేయడం.. పీయూష్ కు అసహనాన్ని తెప్పించింది. తలసానికి అప్పటికప్పుడే రిటార్ట్ ఇచ్చిన పీయూష్.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ చురకలు అంటించే ప్రయత్నం చేశారు.

యూపీయే హయాంలో తెలంగాణకు 258 కోట్ల రూపాయలే ఇస్తే.. మోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2 వేల 602 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పారు. అంతే కాదు.. దక్షిణ భారతదేశాన్ని కేంద్రం విస్మరిస్తోందని విమర్శించడం కూడా సరికాదని తప్పుబట్టారు. రాష్ట్రాలు సహకరిస్తేనే రైల్వే లైన్లు పూర్తవుతాయని స్పష్టం చేశారు.

ఇలా.. ఒకే వేదికపై కేంద్ర, రాష్ట్రాల మంత్రులు కౌంటర్ కు ఎన్ కౌంటర్ ఇవ్వడం.. తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. పద్దులపై ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు తెలంగాణ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజా ఘటన ఆ వాగ్యుద్ధాన్ని ముందుకు తీసుకుపోయింది.