ప్లాస్టిక్ నిషేధం దిశగా తిరుమలలో మరో ముందడుగు

తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ తిరుమలలో లడ్డూ కవర్ల విక్రయాలు జరగ్గా.. ఇటీవల తీసుకున్న నిర్ణయంతో వాటి వాడకాన్ని పూర్తిగా ఆపేశారు. దుకాణాల్లోనూ ప్లాస్టిక్ వాడకాన్ని దాదాపుగా తగ్గించేశారు. లడ్డూల జారీకి కాగితం బాక్సులను అందుబాటులోకి తెచ్చారు. ఇలా రకరకాల చర్యలతో ప్లాస్టిక్ కు దూరంగా ఉంటున్న తిరుమలలో.. మరో కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది.

ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వాడకాన్నీ పూర్తిగా నిషేధించేందుకు తిరుమలలో అడుగులు పడ్డాయి. వాటి స్థానంలో గాజు సీసాలను తీసుకువచ్చారు. ఒక్కో బాటిల్ లో 750 మిల్లీ లీటర్ల నీళ్లు ఉంటాయి. వాటిని తాగిన అనంతరం సీసా బాటిళ్లను తిరిగి ఇచ్చేయాలి. ధర 20 రూపాయలు. ఆ బాటిల్ కావాలనుకుంటే అదనంగా మరో 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమలుకు ఓ సంస్థతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

సీసా బాటిళ్లు మాత్రమే కాదు.. త్వరలోనే రాగి బాటిళ్లు, మట్టి బాటిళ్లనూ తిరుమలలో భక్తులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పర్యావరణ హితంగా అమలు చేస్తున్న ఈ చర్యలకు భక్తుల నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. ఆలయ పరిధిలో మాత్రమే కాకుండా.. తిరుమల అంతటా కఠినంగా ఈ నిర్ణయాలు అమలు చేస్తేనే మార్పు సాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే పరిశుభ్రత విషయంలో.. తిరుమల ఇతర ఆధ్యాత్మిక నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. శానిటేషన్ నిర్వహణ లోనూ ముందంజలో ఉంది. తాజాగా.. ప్లాస్టిక్ నిషేధంపై అమలు చేస్తున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తే… ఇతర ఆధ్యాత్మిక నగరాల్లోనూ వీటిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది.