ఆర్టీసీలో స్మార్ట్ గా ‘చలో’…. చిల్లర లేకున్నా టికెట్ కు ఢోకా లేదు

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ.. స్మార్ట్ బాట పట్టింది. చలో పేరుతో స్మార్ట్ ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ తో పాటు.. స్మార్ట్ కార్డులు కూడా విడుదల చేసింది. ఈ కార్డులతో టిమ్ మెషీన్ లో స్వైప్ చేసి టికెట్ తీసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. చలో యాప్ ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ కల్పించింది.

ముందుగా.. పైలట్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో ఈ యాప్ ను, స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ. రెండున్నర లక్షల మంది ప్రయాణికులకు ఇది ఉపయోగకరమని అధికారులు అంచనా వేస్తున్నారు. నిత్యం ప్రయాణం చేసే వారికి ఛలో యాప్, ఆర్టీసీ స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయని.. చిల్లర లేకున్నా సమస్య కాదని.. వీటి వాడకంతో ప్రయాణికులకు, సిబ్బందికి సమయం ఆదా అవుతుందని ఆర్టీసీ చెబుతోంది.

రైల్వేల్లో స్మార్ట్ కార్డుల వాడకం.. చాలా సంవత్సరాల క్రితమే మొదలైంది. వాటి మాదిరే రోడ్డు ప్రయాణికులకు ఉపయోగపడేలా ఆర్టీసీ తెచ్చిన ఈ విధానం.. ప్రయాణికుల మన్నన చూరగొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.