‘భారతీయుడు-2’ షూటింగ్ లో ప్రమాదం… ముగ్గురి మృతి… శంకర్ కు తీవ్ర గాయాలు?

దర్శకుడు శంకర్, విశ్వనటుడు కమలహాసన్ కాంబినేషన్లలో తాజాగా తెరకెక్కుతున్న మూవీ ‘ఇండియన్2’. చెన్నై సమీపంలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో ‘ఇండియన్2’ షూటింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అదేవిధంగా దర్శకుడు శంకర్ కు కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలుస్తోంది.

‘భారతీయుడు-2’ మూవీని దర్శకుడు శంకర్ తన సహాయకులతో కలిసి చిత్రీకరిస్తుండగా సెట్లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయినట్లు సమాచారం. శంకర్ షూటింగ్ ను వీక్షిస్తుండగా వారు ఉన్న టెంట్ పైనే క్రేన్ క్రాష్ అయి  ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పొడక్షన్ అసిస్టెంట్స్ మధు(29), చంద్రన్ (60), సహాయ దర్శకుడు కృష్ణ(34) మృతిచెందినట్లు సమాచారం. అలాగే మరో 10మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న కమలహాసన్ ట్విట్లర్లో స్పందించారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని భావోద్వేగానికి గురయ్యాడు. ముగ్గురు సహాయకులను కొల్పోవడం బాధకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

మూవీలో కమలహాసన్ కు జోడీగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతీసింగ్ నటిస్తున్నారు. కాజల్ ఇందులో 60ఏళ్ల భామగా కనిపించనుందని సమాచారం. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న నజరేత్ పేట్ పోలీసులు అక్కడి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద సమయంలో కమలహాసన్ షూటింగ్ స్పాట్ కు కొద్దిదూరంలో ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.