చింతలపూడి ఎత్తిపోతలకు మహర్దశ…. 1931 కోట్ల నాబార్డ్ రుణం మంజూరు

పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మండలాలు.. కృష్ణా జిల్లాలోని 18 మండలాలు.. మొత్తంగా 410 గ్రామాలకు వరప్రదాయినిగా మారనున్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి మహర్దశ చేకూరింది. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ అసిస్టేన్స్ కింద.. 1,931 కోట్ల రుణాన్ని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అందించేందుకు నాబార్డు అంగీకరించింది. రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి సంస్థకు ఈ రుణాన్ని మంజూరు చేస్తున్నట్టుగా నాబార్డ్ తెలిపింది.

చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే.. 410 గ్రామాల్లోని 4 లక్షల 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. ఖరీఫ్ సాగు నిమిత్తం.. మూడు దశల్లో 53.50 టీఎంసీల నీరు ఈ ప్రాంతానికి సాగు నిమిత్తం అందుతుంది. అలాగే.. కాకజల్లేరు వద్ద 14 టీఎంసీల రిజర్వాయరు ద్వారా 26 లక్షల ప్రజల దాహార్తిని తీర్చేందుకూ అవకాశం కలుగుతుంది. 2022 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని నాబార్డు అంచనా వేసింది.

ఈ విషయంపై.. రైతులు హర్షం వ్యక్తం చేశారు. అనుకున్న సమయానికే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి.. తమకు సాగు కష్టాలు లేకుండా చూడాలని కోరారు. రుణ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన శ్రమను, అధికారుల కృషిని రైతులు ప్రశంసించారు.