ఐటీ దాడుల నుంచి దృష్టి మరల్చేందుకే బస్సు యాత్ర….

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఆయన బస్సు యాత్ర చేపట్టారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ప్రకాశం జిల్లాలో ఇవాళ చంద్రబాబు బస్సు యాత్ర సందర్భంగా పలు విమర్శలు చేశారు. వైసీపీ నేతల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీనిపై అంబటి స్పందిస్తూ…

ఎవరి తోకలు ఎవరు కత్తిరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే ఇప్పటికే టీడీపీ పవర్ కట్ చేశారని.. అధికారం పోయిందనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని అంబటి అన్నారు.

టీడీపీ నేతల ఇండ్లపై జరుగుతున్న ఐటీ దాడుల నుంచి దృష్టి మరల్చేందుకే చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టారని ఆయన విమర్శించారు. అయినా ఆ బస్సు యాత్రకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని రాంబాబు అన్నారు.

పంచాయితీరాజ్ చట్టంతో చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటో అర్థం కావట్లేదని.. స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం నియంత్రించడానికే ఆ చట్టం తెచ్చినట్లు రాంబాబు తెలిపారు. డబ్బులు వెదజల్లి అధికారంలోనికి రావడం చంద్రబాబుకు అలవాటేనని రాంబాబు వెల్లడించారు.