ఉరి తప్పించుకోవడానికి నిర్భయ దోషి ఆత్మహత్యాయత్నం

దేశ వ్యాప్తంగా ‘నిర్భయ’ సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ కేసులోని నిందితులను మరికొద్దిరోజుల్లో ఉరి తీయనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉరిశిక్ష వాయిదా పడుతూ వస్తుండటంతో బాధితులు తమకు న్యాయం జరగడం లేదని పలుమార్లు మీడియా ఎదుట వాపోయారు.

కాగా ‘నిర్భయ’ నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ జైలులోని తన గదిలో ఆత్మహత్యాయత్నానికి యత్నించడం సంచలనం రేకెత్తిస్తుంది. వినయ్ శర్మ తన తలను జైలు గోడలకు బాదుకుంటుండగా గమనించిన పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిర్భయ కేసులో ముఖేష్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్ లకు మార్చి 3న ఉదయం 6గంటలకు ఉరి తీయాలని సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఇప్పటికే నిర్భయ నిందితులకు మూడు సార్లు డెత్ వారెంట్ జారీ అయి పలుమార్లు వాయిదాపడుతూ వస్తుంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం సంఘటన వెలుగుచూడటంతో మరోమారు ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

నిర్భయ నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ తనపై పోలీసులు దాష్టికం చేస్తున్నట్లు ఆరోపించాడు. ఇప్పటికే జైలులో ఆహారం తీసుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే జైలులో తన తలను బాదుకోవడంపై పలు అనుమానులకు తావిస్తోంది. పోలీసులే అతడి తలను గోడకేసి బాదారా? లేక నిందితుడు తన మానసిక పరిస్థితి బాగోలేదని డ్రామా ఆడుతూ ఆత్మహత్యాయత్నం చేసి ఉరిశిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పటికే కోర్టు కూడా వినయ్ శర్మ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని తీహర్ జైలు సూపరింటెండెంట్ కు సూచించిది. ఈ నేపథ్యంలో నిర్భయ నిందితుడి ఆత్మహత్యాయత్నం ఆలస్యంగా వెలుగుచూడటంపై కోర్టు ఎలా రియాక్టవుతుందో వేచి చూడాల్సిందే.