జగన్ ప్రభుత్వం పై మండిపడ్డ ఉండవల్లి

రాష్ట్రంలో పరిస్థితులు.. అధికారుల తీరుపై రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ అవినీతి రహిత పాలన అందించాలనుకున్నా…. ప్రభుత్వ విధి నిర్వహణలో లోపాల వల్ల అధికారులలో అవినీతి తగ్గకపోగా పెరుగుతోందని ఉండవల్లి అన్నారు.

25 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కోసం భూసేకరణ చేయమని ప్రభుత్వం ఆదేశించిందని… అయితే నియమ నిబంధనలు ఏర్పాటు చేయడంలో విఫలమైనందువల్ల ఈ స్కీమ్ లోనూ అధికారులు అడ్డంగా మేసేస్తున్నారని ఉండవల్లి తెలిపారు.

పేదల ఇళ్ల స్థలాలకోసం రోడ్డుపక్కన ఉండే ఖరీదైన భూములను కూడా అధికారులు సేకరణ లిస్ట్ లో చేర్చారని… అది తెలిసి భూ యజమానులు అధికారులను సంప్రదిస్తే వాళ్ళ భూమిని వాళ్ళకు వదిలేయడానికి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి సరైన సమాచార వ్యవస్థ లేకపోవడంతో ఈ విషయాలు జగన్ దాకా తెలియడం లేదని ఆయన చెప్పారు.

రాజమహేంద్రవరంలో ఇసుక లభించడం లేదంటే.. అది ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత కాకుంటే మరేంటని ప్రశ్నించారు. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరానికి ఇసుక రావడం ఏంటని.. రాత్రిళ్లు చూస్తుంటే లారీలకు లారీలు తరలి వస్తోందని అన్నారు.

అవినీతి రహిత పాలన అంటున్నారు కానీ.. అధికారులు లంచం తగ్గించడం లేదని చెప్పారు. గ్రీవెన్స్ సెల్స్ పెడితే ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రారని స్పష్టం చేశారు. ఏసీబీ దాడులతో.. అధికారుల్లో భయం నెలకొందని… అయితే ఆ ఏసీబీ చీఫ్ మారగానే పరిస్థితి మళ్ళీ మామూలుగానే తయారవుతుందని వ్యాఖ్యానించారు.

కొన్ని ప్రాంతాల్లో నాటు సారా మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని…. ఒకసారి వస్తే దీనిని ఆపడం కష్టమని అన్నారు. మంచి పని చేద్దామని ఆలోచన ఉంటే సరిపోదని…. ఎలా ఆచరించాలన్న వ్యూహం కూడా ఉండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అధికారుల్లో అవినీతి తగ్గలేదన్న ఉండవల్లి…. తాజా పరిస్థితులు చూస్తుంటే మరింత పెరిగిందని అన్నారు. మంచి పని చేయాలని అనుకున్నప్పుడు కార్యాచరణ కూడా సరిగా ఉండాలని ప్రభుత్వానికి సూచించారు.