కంగారూ గడ్డపై మహిళా ప్రపంచకప్ షురూ

  • ఆశలపల్లకిలో భారత్!

కొత్త దశాబ్దపు మహిళ తొలి టీ-20 ప్రపంచకప్ కు కంగారూల్యాండ్ లో తెరలేచింది. ప్రపంచ మహిళా క్రికెట్లోని పది అత్యుత్తమజట్ల ఈ సమరంలో… సూపర్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు తొలిసారిగా హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలో నిలిచింది.

మహిళా క్రికెట్ చరిత్రలో మరో ప్రపంచకప్ కు రంగం సిద్ధమయ్యింది. ఆస్ట్ర్రేలియా వేదికగా మార్చి 8 వరకూ జరిగే 2020 టీ-20 ప్రపంచకప్ కు తెరలేచింది. నాలుగుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా, మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లకు న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లతో కలసి భారత్ సవాలు విసురుతోంది.

2009 నుంచి 2018 వరకూ…

పురుషులకు టీ-20 ప్రపంచకప్ 2007లో ప్రారంభమైతే…మహిళలకు 2009లో ప్రారంభించారు. కేవలం 11 సంవత్సరాల క్రితం నుంచి మహిళలకు సైతం…టీ-20 ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహిస్తూ వస్తోంది. 2009లో లండన్ వేదికగా తొలిసారిగా మహిళా టీ-20 ప్రపంచకప్ ను నిర్వహించారు.

2009 లో ప్రారంభమైన మహిళా ప్రపంచకప్ నుంచి 2018 ప్రపంచకప్ వరకూ…ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల షోగానే సాగుతూవస్తోంది.

ఇంగ్లండ్ వేదికగా 2009లో నిర్వహించిన ప్రారంభ ప్రపంచకప్ లో ఆతిథ్య ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.2010 ప్రపంచకప్ నుంచి 2014 ప్రపంచకప్ వరకూ నిర్వహించిన మూడుటోర్నీల్లోనూ…ఆస్ట్రేలియా విజేతగా నిలవడం ద్వారా హ్యాట్రిక్ సాధించింది. మహిళా ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా మూడు ప్రపంచకప్ లు నెగ్గిన ఏకైకజట్టుగా చరిత్ర సృష్టించింది.

వెస్టిండీస్ సంచలనం…

ఆ తర్వాత…భారత్ వేదికగా ముగిసిన 2016 ప్రపంచకప్ లో మాత్రం…తొలిసారిగా టైటిల్ నెగ్గడం ద్వారా వెస్టిండీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ఆధిపత్యానికి కరీబియన్ మహిళలు తొలిసారిగా గండి కొట్టి…తమకు తామే సాటిగా నిలిచారు.

గత ఆరు మహిళా ప్రపంచకప్ టోర్నీలలోనూ ఆస్ట్రేలియా నాలుగుసార్లు, ఇంగ్లండ్, విండీస్ ఒక్కోసారి టైటిల్ నెగ్గితే… న్యూజిలాండ్, ఇంగ్లండ్ చెరో రెండుసార్లు, ఆస్ట్రేలియా ఒకసారి రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకొన్నాయి.

మహిళా టీ-20 ప్రపంచకప్ అంటే …ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల… మూడుస్తంభాలాట మాత్రమే కాదని… నాలుగోస్తంభం రూపంలో తామూ ఉన్నామని..2016 ప్రపంచకప్ సాధించడం ద్వారా…కరీబియన్ మహిళలు చాటుకొన్నారు.

మహిళా టీ-20 చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ ఘనతను ఇంగ్లండ్ ప్లేయర్ చార్లొట్టీ ఎడ్వర్డ్స్ సొంతం చేసుకొంది. చార్లొట్టీ 768 పరుగులు సాధించింది.

ఇక…బౌలింగ్ విభాగంలో…కంగారూ పేసర్ ఎల్సీ పెర్రీ నంబర్ వన్ బౌలర్ గా నిలిచింది. ఎల్సీ ఇప్పటి వరకూ 27 వికెట్లు పడగొట్టి అగ్రశ్రేణి బౌలర్ గా రికార్డుల్లో చేరింది.

మహిళా టీ-20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే ఆస్ట్రేలియా అన్నమాటే గుర్తుకు వస్తుంది. గత ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో మూడుసార్లు విజేతగా నిలవడం తోపాటు..వరుసగా మూడుసార్లు ట్రోఫీ అందుకొన్న జట్టు కంగారూ టీమ్ మాత్రమే.

టైటిల్ వేటలో భారత్…

11 సంవత్సరాల…టీ-20 మహిళా ప్రపంచకప్ చరిత్రలో…భారత్ కూ కొద్దో..గొప్పో రికార్డే ఉంది. 2009 నుంచి 2018 ప్రపంచకప్ వరకూ… గత ఆరు టోర్నీల్లో పాల్గొంటూ వచ్చిన భారత్.. మొత్తం పెద్దజట్లలో చిన్నజట్టుగా…చిన్నజట్లకే అతిపెద్దజట్టుగా గుర్తింపు తెచ్చుకొంది. అత్యుత్తమంగా…2009, 2010 ప్రపంచకప్ టోర్నీల సెమీస్ కు అర్హత సంపాదించిన జట్టుగా భారత్ నిలిచింది.

గత..ఆరు టోర్నీల్లో 26 మ్యాచ్ లు ఆడిన భారత్ 13 విజయాలు, 13 పరాజయాల రికార్డుతో….50 విజయ శాతాన్ని మాత్రమే సాధించింది.

హార్డ్ హిట్టింగ్ ఆల్ రౌండర్ ..హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో…భారతజట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. గ్రూపులీగ్ లో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో తలపడనుంది.

సూపర్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టులో షెఫాలీవర్మ, జెమీమా రోడ్రిగేస్, స్మృతి మంథానా లాంటి పలువురు మెరికల్లాంటి ప్లేయర్లు ఉన్నారు. ప్రపంచకప్ కు సన్నాహకంగా జరిగిన ముక్కోణపు సిరీస్ లో 4వ ర్యాంక్ భారత్… టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ లాంటి మేటిజట్లపై సాధించిన సంచలన విజయాల ప్రేరణతో టైటిల్ వేటకు దిగుతోంది.

ప్రతిభకు కొద్దిపాటి అదృష్టం సైతం తోడైతే…భారత్ టైటిల్ గెలుచుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు 1983 ప్రపంచకప్ లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారతజట్టు సాధించిన అన్యూహ్య విజయాన్నే ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో సైతం తమజట్టూ సాధించే అవకాశం ఉందని జట్టు శిక్షకుడు రామన్ ధీమాగా చెబుతున్నారు. అదే జరగాలని దేశంలోని కోట్లాదిమంది భారత అభిమానులు సైతం కోరుకొంటున్నారు.