దిశకు ప్రశంసలు… తామూ అమలు చేస్తామంటున్న మహారాష్ట్ర

మహిళలు, చిన్నారుల రక్షణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ బిల్లు అద్భుతమైనదని.. మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రశంసించారు. రాష్ట్రంలో పర్యటించిన ఆయన బృందం.. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకునేందుకు సీఎం జగన్, హోం మంత్రి సుచరిత, ఉన్నతాధికారులతో సమావేశమైంది. ప్రతిపాదనలు తెలుసుకుని ముఖ్యమంత్రిని, హోం మంత్రిని అభినందించింది.

ఈ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి.. మహారాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆ రాష్ట్ర మంత్రి అనిల్ చెప్పారు. దిశ బిల్లు తెచ్చిన అనతి కాలంలోనే అదే పేరుతో ప్రత్యేకంగా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి మహిళల రక్షణకు చేపడుతున్న చర్యలు అభినందనీయమని అభినందించారు. వారికి.. బిల్లుతో పాటు.. దిశ పీఎస్ లో వసతుల వివరాలను మంత్రి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని పూర్తిగా వివరించారు.

దిశ పోలీసు స్టేషన్ లకు క్రైమ్ డిటెక్షన్ కిట్లను పంపిణీ చేశామని.. ప్రతి పోలీసు స్టేషన్ ను స్నేహపూర్వక మహిళా పోలీసు స్టేషన్ గా మారుస్తామని మంత్రి సుచరిత చెప్పారు. ఈ బిల్లు అమలులో భాగంగా 87 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్.. వాటితో 13 ప్రత్యేక న్యాయస్థానాలు, ప్రత్యేక పోలీసు స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూం, వన్ స్టాప్ సెంటర్లనూ ఏర్పాటు చేసినట్టు వివరించారు.

ఈ వివరాలన్నీ తెలుసుకున్న మహారాష్ట్ర బృందం.. దిశ బిల్లుతో పాటు, ప్రత్యేక పోలీసు స్టేషన్ల ఏర్పాటుపైనా ఆసక్తిని చూపించింది. తమ ప్రభుత్వానికి విన్నవించి.. మహారాష్ట్రలో కూడా అమల్లోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.