ఈఎస్ఐలో కొనుగోళ్లు… అవినీతి 70 కోట్లు… దందాలో మాజీ మంత్రులు?

మరో అవినీతి ఆరోపణ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించింది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రం పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రుల్లో.. ఔషధాలు, పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో.. ఏకంగా 70 కోట్ల రూపాయల విలువైన అవినీతి జరిగినట్టు విజిలెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. ముగ్గురు డైరెక్టర్ల కాలంలో.. ఈ అవినీతి దందా నడిచినట్టు గుర్తించారు.

తెలంగాణలోనూ గత ఏడాది ఇలాంటి వ్యవహారమే వెలుగుచూడగా.. అధికారులతో పాటు విలేకరులూ అందులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా.. అదే రీతిన ఆంధ్రప్రదేశ్ లోనూ ఈఎస్ఐ ఆస్పత్రుల కేంద్రంగా ఇంతటి భారీ కుంభకోణం వెలుగు చూడడం.. ప్రకంపనలు సృష్టిస్తోంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకూ ఇందులో భాగస్వామ్యం ఉండవచ్చన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 4 ఈఎస్ఐ ఆసుపత్రులు, 3 డయాగ్నొస్టిక్ సెంటర్లు, 78 ఈఎస్ఐ డిస్పెన్సరీలకు ఔషధాలు, పరికరాలు సమకూర్చే క్రమంలో ఇంతటి అవినీతి జరిగినట్టు అధికారుల దర్యాప్తులో తేలినట్టుగా సమాచారం. ఈ విషయంపై కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. అవినీతితో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు.. తనపై వస్తున్న ఆరోపణల మీద అచ్చెన్నాయుడు స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు కేంద్రం ఆదేశాలమేరకే నిర్ణయాలు అమలు చేసినట్టు స్పష్టం చేశారు.