కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు.. రాష్ట్రంలో నమోదవని కేసులు

ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ – 19 (కరోనా వైరస్) విషయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విజయవంతమైంది. సమీపంలోని కేరళలో కరోనా కేసులు నమోదవగా.. ఆ పరిస్థితి రాష్ట్రానికి ఎదురుకాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.

కరోనా సోకిన 193 దేశాల నుంచి మన రాష్ట్రానికి 187 మంది వరకూ రాగా.. వారందరినీ ఇళ్లలోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. వీరిలో ఎవరికీ వైరస్ సోకిన దాఖలాలు లేవని తెలిపారు. చైనా నుంచి వచ్చిన ఐదుగురికి 28 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణ పూర్తయిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి బాగుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారుల నియామకం.. ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లలో ఐసొలేషన్ వార్డులు అందుబాటులోకి తేవడం.. రాష్ట్ర స్థాయిలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూము ఏర్పాటు వంటి చర్యలు… సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టమవుతున్నా.. ముందు జాగ్రత్తలు మాత్రం కొనసాగించేందుకే అధికారులు నిర్ణయించారు.

ఏ క్షణంలో ఇబ్బంది ఎదురైనా.. ఈ వైరస్ ను విస్తరించకుండా ఉండేందుకు.. వీలైనంతవరకు కరోనాను రాష్ట్రంలో ప్రవేశించకుండా చేయడమే లక్ష్యంగా సిబ్బంది పని చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు ఉంటే మాస్కులు ధరించాలని, వీటి కోసం ప్రభుత్వ హాస్పిటళ్లలో సంప్రదించాలని సూచించారు. ఎలాంటి సమస్య ఉన్నా.. వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా ప్రజలను కోరారు.