‘సిట్’పై మొదలైన టీడీపీ ఎదురుదాడి…. కానీ….

రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో వస్తున్న ఆరోపణలతో పాటు.. గత ప్రభుత్వం ఈ దిశగా తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం.. అప్పటి అధికార.. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పూర్తి ఆధారాలతో చర్యలు తీసుకునే దిశగా సీనియర్ ఐపీఎస్ లతో ఏర్పాటు చేసిన సిట్ విషయంలో.. టీడీపీ నేతలు ముందు జాగ్రత్తగా ఎదురుదాడి మొదలుపెట్టారు.

సిట్ తో కాదు.. సీబీఐతో అయినా దర్యాప్తు చేయించుకోండి పర్వాలేదు.. అంటూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ రోజు సవాల్ చేశారు. ఎవరితో దర్యాప్తు చేయించుకున్నా పర్వాలేదని అన్నారు. వెలగపూడిలో రాజధాని రైతుల ఆందోళనలకు మద్దుతు తెలిపిన ఆయన.. ఈ సందర్భంగా సిట్ పై స్పందించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే సిట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు.

చినరాజప్ప, బొండా ఉమ లాంటి నేతలు కూడా ఈ విషయంలో చాలా దూకుడుగా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గల్లా మాత్రమే కాక.. మరింతమంది నేతలు ఈ దిశగా ఎదురు దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కానీ.. సిట్ విచారణకు సహకరిస్తామన్న మాటను మాత్రం వారు చెప్పడం లేదు. ఎవరినైనా పిలిచి విచారణ చేసే హక్కు, ఆరోపణలపై అనుమానాలపై ప్రశ్నించే హక్కు ఉన్న సిట్ కు.. ఎలాంటి విషయంపై అయినా సహకరిస్తామని, అనుమానాలు నివృత్తి చేస్తామని అనడం లేదు.

ఇదే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు ఆయుధంగా మారుతోంది. సిట్ పై ఎదురుదాడి చేస్తున్న టీడీపీపై.. మళ్లీ విమర్శలతో విరుచుకుపడే అవకాశాన్ని కల్పిస్తోంది.