10వేల అడుగుల ఎత్తున ”రెడ్”

రామ్ హీరోగా నటిస్తున్న సినిమా రెడ్. ఓ తమిళ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను తెలుగులో కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నాడు. నివేత పెతురాజ్, మాళవికా శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ కొత్త రికార్డు సృష్టించారు. 10వేల అడుగుల అత్యంత ఎత్తైన ప్రదేశంలో సినిమాను షూట్ చేశారు. అయితే అది కేవలం ఓ పాట కోసం కావడం విశేషం.

ఇటలీలోనే అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం డోలమైట్స్. సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున ఉంది ఈ లొకేషన్. ఇక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ మైనస్ 5 డిగ్రీలు ఉంటుంది. ఇలాంటి గడ్డకట్టే ప్రాంతంలో రెడ్ సినిమాకు సంబంధించి ఓ పాట తీశారు. రామ్, మాళవికశర్మ మధ్య ఈ సాంగ్ ను షూట్ చేశారు.

ఈ ప్రాంతంతో పాటు ఇటలీ దేశంలోని టుస్కాన్, ఫ్రారెన్స్ ప్రాంతాల్లో కూడా మరో పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ ను కూడా రామ్, మాళవికపై షూట్ చేశారు. తాజా షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన ఒకేఒక్క పాటను రామోజీ ఫిలింసిటీలో షూట్ చేయబోతున్నారు. నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసి.. ఏప్రిల్ 9న రెడ్ ను వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.