165 పరుగులకే భారత్ ఆలౌట్

  • వెలింగ్టన్ టెస్టులో బౌలర్లదే హవా

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో…ప్రపంచ నంబర్ వన్ భారత్ కు తొలిసారిగా అసలు పరీక్ష ఎదురయ్యింది. న్యూజిలాండ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా… వెలింగ్టన్ బేసిన్ రిజర్వ్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలిటెస్ట్ రెండోరోజుఆట…మొదటి సెషన్ లోనే భారత్ 165 పరుగులకే కుప్పకూలింది.

స్వింగ్ బౌలింగ్ కు అనువుగా ఉన్న బేసిన్ రిజర్వ్ పిచ్ పైన…విరాట్ సేన పేకమేడలా కూలింది. భారత ఇన్నింగ్స్ కు కేవలం 68.1 ఓవర్లలోనే కివీ పేసర్ల త్రయం బౌల్ట్, జామీసన్, సౌథీ తెరదించారు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఒక్కడే ఒంటరిపోరాటం చేసి 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఓపెనర్లు పృథ్వీ షా 16, మయాంక్ అగర్వాల్ 34, పూజారా 11, కొహ్లీ 2, విహారీ 7, పంత్ 19, మహ్మద్ షమీ 21 పరుగులు సాధించారు.

న్యూజిలాండ్ బౌలర్లలో అరంగేట్రం హీరో జామీసన్ 4 వికెట్లు, టిమ్ సౌథీ 4 వికెట్లు, బౌల్ట్ 1 వికెట్ పడగొట్టారు.
ఐసీసీ టెస్ట్ లీగ్ లో ఇంతకు ముందు వరకూ ఆడిన ఏడుకు ఏడుటెస్టుల్లోనూ తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా 360 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన భారత్…గత ఏడాది కాలంలో …ఓ టెస్టు ఇన్నింగ్స్ లో 165 పరుగులకే కుప్పకూలడం ఇదే మొదటిసారి.

స్వదేశీ పిచ్ లపైన టన్నుల కొద్దీ పరుగులు సాధించిన భారత స్టార్ ప్లేయర్లు…విదేశీ స్వింగ్, సీమ్ పిచ్ లపైన రాణించలేరని…మరోసారి కివీ పేస్ బౌలర్లు నిరూపించారు.